తగ్గనున్న మొబైల్ చార్జీలు
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ రేట్లు ఏప్రిల్ ఒకటి నుండి 20 శాతం మేరకు తగ్గనున్నాయి. టెర్మినేషన్ చార్జీలు 33 శాతం అంటే నిమిషానికి 20 పైసల స్థాయికి తగ్గిస్తున్నట్లు టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించింది. పలు నెట వర్క్ ల మధ్య కాల్స్ నడిచేందుకు గాను ఒక ఆపరేటర్ మరో ఆపరేటర్ కు చెల్లిస్తున్న చార్జీలను టెర్మినేటర్ చార్జీలని పిలుస్తారు. ఉదాహరణకు, భారతి ఎయిర్ టెల్ వినియోగదారుడు వోడాఫోన్ సబ్ స్క్రైబర్ కు కాల్ చేసిన సందర్భంలో వోడా ఫోన్ సంస్థకు ఎయిర్ టెల్ సంస్థ నిమిషానికి 30 పైసల్ని టెర్మినేషన్ చార్జీల కింద చెల్లించవలసి ఉంటుంది. టెర్మినేషన్ చార్జీల తగ్గింపు మైబైల్ టారిఫ్ ల తగ్గింపుకు దారితీస్తుంది.
ఏప్రిల్ 1 నుండి భారత్ కు చేస్తున్న కాల్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. విదేశీ నెట్ వర్క్ లపై టెర్మినేషన్ చార్జీలను అదనంగా పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దాంతో భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఎస్సార్, రిలయన్స్ కమ్యునికేషన్స్, ఐడియా సెల్యులర్, ఎయిర్ సెల్ కంపెనీలు విదేశీ టెలికామ్ సంస్థల నుండి వసూలు చేసే టెర్మినేషన్ చార్జీలను పెంచనున్నాయి. ఈ కంపెనీలు టెర్మినేషన్ చార్జీలను దాదాపు 33 శాతం పెంచనున్నాయి. ఇప్పటి వరకు, విదేశీ సంస్థలపై నిమిషానికి 30 పైసల కంటే అదనంగా వసూలు చేయరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ఈ టెర్మినేషన్ చార్జీలను ట్రాయ్ నిమిషానికి 40 పైసలకు పెంచింది.
విదేశాలకు చేస్తున్న ప్రతి నిమిషం ఫోన్ కాల్ కు 3 నిమిషాల చొప్పున విదేశీ కాల్స్ ను భారత్ అందుకుంటోందని ట్రాయ్ తెలిపింది. విదేశాల నుండి భారత్ కు వస్తున్న కాల్స్ ద్వారా విదేశీ మారక ద్రవ్యం అదనంగా లభిస్తుందని టెలికామ్ కంపెనీలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ కాల్స్ పై టెర్మినేషన్ చార్జీలను పెంచడం వలన భారతీయ టెలిఫోన్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులుండవని ప్రముఖ టెలికామ్ కంపెనీలు చెబుతున్నాయి. ఈ ఆదాయాన్ని వినియోగదారుల అంతర్జాతీయ కాల్స్ పై టారిఫ్ లను తగ్గించేందుకు వినియోగిస్తామని ఆ కంపెనీలు తెలియజేసాయి.
News Posted: 9 March, 2009
|