వాషింగ్టన్: సత్యం కంప్యూటర్స్ తో చేసుకున్న ప్రత్యక్ష కాంట్రాక్టును ఐక్యరాజ్య సమితి రద్దుచేసుకున్నట్లు ఫాక్స్ న్యూస్ మీడియా వెల్లడించింది. సత్యం కంప్యూటర్స్ సంస్థలో 7800 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకుందని ఫాక్స్ న్యూస్ యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి తెలియజేశారు. అయితే కాంట్రాక్టు వివరాలను ఆ నివేదిక వెల్లడించలేదు. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడినట్లు ప్రకటించిన నాటి నుండి సత్యం సంస్థలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.
'సత్యం ప్రహసనం వెలుగు చూడడంతో ఆ సంస్థతో ఉన్న ప్రత్యక్ష కాంట్రాక్టులన్నిటినీ వెంటనే రద్దు చేయవలసిందిగా తన అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కంప్యూటర్ కేంద్రాన్ని ఐక్యరాజ్య సమితి కోరింది. ఐక్యరాజ్య సమితి తరపున ఇంటర్నేషనల్ కంప్యూటర్ కేంద్రం పనిచేస్తుంది' అని సోమవారంనాడు మీడియా కథనం తెలిపింది. ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ వెండర్ డేటాబేస్ నిర్వహణ యంత్రాంగం నుండి సత్యం సంస్థను తొలగించి ఆ కంపెనీతో చేసుకున్న కాంట్రాక్టులన్నిటిని సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిర్ణయించుకుందని యుఎన్ ప్రొక్యూర్మెంట్ డివిజన్స్ ఇంటగ్రేటెడ్ సపోర్ట్ సర్వీస్ చీఫ్ కియోహిరో మిత్సుయ్ తెలిపారు.