ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ కు ఢోకాలేదు
న్యూఢిల్లీ: లే ఆఫ్ ల గడ్డుకాలం కొనసాగుతున్నప్పటికీ కాల్ లెటర్లు అందుకున్నవారి నందర్ని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ శుక్రవారంనాడు ప్రకటించింది. ఐటి వ్యాపారం మందగించడంతో ఇన్ఫోసిస్ కొత్తగా ఉద్యోగులను తీసుకోలేని పరిస్థితి కొనసాగుతోంది. అయినప్పటికీ ఉద్యోగాలిస్తామని పంపిన లెటర్లను మేము గౌరవిస్తాము. మా వాగ్దానాలను మేము నిలబెట్టుకుంటామని ఇన్ఫోసిస్ కో చైర్మన్ నందన్ నిలేకణి తెలిపారు. కంపెని సాధారణ నియామకాలన్నిటిని నిలిపి వేశామని ఆయన మీడియాకు తెలిపారు.
నాస్దాక్ జాబితాలోని ఇన్ఫోసిస్ సంస్థ 2009-10 ఆర్ధిక సంవత్సరానికి గాను దాదాపు 18వేల మంది గ్రాడ్యుయేట్లను దేశంలోని పలు కేంపస్ ల నుండి ఎంపిక చేసింది. 'ఎంపిక చేసిన వారందరూ ఈ ఏడాది జులై నాటికి కంపెనీలో చేరనున్నారు' అని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ గోపాలక్రిష్ణన్ ఈ మధ్య తెలియజేశారు. హెచ్1బి వీసా పై అమెరికా ప్రభుత్వ ఆంక్షల గురించి ప్రస్తావించిన సందర్భంలో నీలేకణి నేరుగా సమాధానం చెప్పలేదు. రక్షణ చర్యలు ఎవరికి ఉపయోగపడవని ఆయన వ్యాఖ్యానించారు.
'మనమందరం స్వేచ్చా వాణిజ్యాన్ని కోరుకుంటున్నాము. ఇది అందరకి మంచిది. స్వేచ్చా వాణిజ్యం పురోగతికి సోపానం. హెచ్1బి విసాపై కొంత గందరగోళం జరిగినప్పటికీ ప్రజలు త్వరలో స్వేచ్ఛా వాణిజ్యం వైపు మొగ్గుతారు' అని నీలేకణి తెలిపారు. విదేశాల నుండి ఔట్ సోర్సింగ్ ను పొందే కంపెనీలకు పన్ను రాయితీలను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని భారత ఐటి, బిపిఓ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ఐటి, బిపిఓ సంస్థల్లో 20 లక్షల మంది ఐటి నిపుణులు పనిచేస్తున్నారు.
News Posted: 13 March, 2009
|