మళ్ళీ ఎగసిన సెన్సెక్స్
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో సెన్సెక్స్ ఈ ఏడాదిలోనే అత్యున్నత స్థాయికి ఎగసింది. శుక్రవారంనాడు ట్రేడింగ్ ముగిసే నాటికి 412.86 పాయింట్లు లాభాన్ని సాధించింది. అయితే పెట్టుబడి ప్రవాహాలు మాత్రం మందకొడిగానే సాగాయి. బాంబే స్టాక్ ఎక్చేంజ్ శుక్రవారంనాడు ఆశాజనకంగానే ప్రారంభమైంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసేనాటికి సెన్సెక్స్ 4.95 శాతం పెరిగి 8,756.61 పాయింట్ల వద్దకు చేరింది. గతంలో, 2008 డిసెంబర్ 10న సెన్సెక్స్ 5.37 శాతం అంటే 492.28 పాయింట్ల పెరుగుదల సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ 101.80 పాయింట్లు అంటే 3.89 శాతం పెరుగుదల సాధించి 2,719.25 పాయింట్ల వద్ద నిలిచింది.
దాంతోపాటు చైనా, దక్షిణ కొరియా, ఇతర ఆసియా మార్కెట్లు కూడా అనుకూల వాతావరణంలో ముందుకు సాగాయి. ఆసియా మార్కెట్లు 3.00 నుండి 5.62 శాతం పెరుగుదల సాధించాయి. వాల్ స్ట్రీట్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 3.46 శాతం పెరిగితే, నాస్దాక్ కాంపోజిట్ ఇండెక్స్ 3.97 శాతం పెరుగుదల సాధించింది. రియాల్టీ , మెటల్, బ్యాంకింగ్, ఐటి రంగాల షేర్లు బాగా పెరుగుదల సాధించాయి. ఇతర షేర్లు సైతం ఒక మోస్తరు లాభించాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్లు శుక్రవారంనాడు ఆశావహంగా ముందుకు సాగాయి.
News Posted: 13 March, 2009
|