అరచేతి మందం లాప్ టాప్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచంలోనే అత్యంత పల్చనైన లాప్ టాప్ ను ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ డెల్ మంగళవారంనాడు విడుదల చేసింది. మార్కెట్లో దొరకే అత్యాధునికమైన, అత్యంత సౌకర్యవంతమైన యాపిల్ ఇన్ కార్పొరేషన్ కు చెందిన 'మాక్ బుక్ ఎయిర్' లాప్ టాప్ కు పోటీగా అత్యంత విలాసవంతమైన ఈ 'అడామో' లాప్ టాప్ ను నేడు డెల్ కంపెనీ విడుదల చేసింది. అల్యూమినియమ్ బాడీతో రూపొందిన ఈ లాప్ టాప్ మందం 0.65 అంగుళాలు మాత్రమే. దీని స్క్రీన్ వెడల్పు 13.4 అంగుళాలు. 128 గిగాబైట్ సాలిడ్ స్టేడ్ డ్రైవ్ ను ఇందులో అమర్చారు. మంగళవారం నుండి ప్రపంచ మార్కెట్లలోకి అడామో లాప్ టాప్ లు దూసుకొస్తున్నాయి.
అడామో లాప్ టాప్ ఖరీదు 1,999 డాలర్లు మాత్రమే. మరో కాన్పిగరేషన్ లో దొరకే అడామో లాప్ టాప్ 2,699 డాలర్లు ఖరీదు చేస్తుంది. ఈ లాప్ టాప్ ఒక టుమి అనే లోబుల్ తో కూడిన బ్యాగ్ లో వస్తోంది. అడామో అంటే లాటిన్ భాషలో 'ప్రేమలో పడటం' అని అర్దం. గత ఏడాది నుండి ఈ మోడల్ గురించి మార్కెట్ లో పలు రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. గత జనవరి లాస్ వెగాస్ లోని ఒక సంబంరంలో ఈ లాప్ టాప్ ను గురించి డెల్ ప్రకటించింది. యాపిల్ కంపెనీకి చెందిన మాక్ బుక్ ఎయిర్ లాప్ టాప్ గత ఏడాది విడుదలైంది. ఈ లాప్ టాప్ 0.76 అంగుళాల మందం ఉంటుంది. అడామో రాకముందు ప్రపంచలో అత్యంత పల్చటి లాప్ టాప్ గా మాక్ బుక్ ప్రసిద్ధి చెందింది.
అయితే మాక్ బుక్ ఎయిర్ కంటే అడామో బరువైనది. 1,799 డాలర్లు ఖరీదు చేసే ఎయిర్ లాప్ టాప్ 3 పౌండ్లు బరువుంటే, అడామో లాప్ టాప్ 4 పౌండ్ల బరువుంది. లెనొవొ గ్రూపు, హ్యూలెట్ పాకార్డ్, సోని కార్పొరేషన్ లాంటి పలు కంప్యూటర్ తయారీ సంస్థలు అత్యంత తేలికగా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగల్గే లాప్ టాప్ లను మార్కెటింగ్ చేస్తున్నాయి.
News Posted: 17 March, 2009
|