ద్రవ్యోల్బణం-0.44%
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం క్రమంగా సున్నా స్థాయికి చేరుకుంటోంది. మార్చ్ మొదటి వారాంతానికి 0.44 శాతానికి చేరింది. ఆహార పదార్ధాలు, పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోవడంతో ద్రవ్యోల్బణం రెండు దశాబ్దాల అత్యల్ప స్థాయికి దిగజారింది. గత ఏడాది ఆగష్టులో 13 శాతం అత్యున్నత స్థాయికి ఎగసి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు సవాలుగా నిలిచిన ద్రవ్యోల్భణం క్రమంగా భూమార్గం పట్టింది.అయితే సున్నకు చేరువవుతున్న ద్రవ్యోల్భణంతో ధరల పెరుగుదల రేటు మైనస్ లోకి వెళ్లి పోయి మరో రకం ఆర్ధిక విపత్తులకు దారి తీసే అవకాశమున్నట్లు ఆర్దిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఫిబ్రవరి28 వారాంతంలో 2.43 శాతంగా ఉన్న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 1.99 శాతం తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి. దాంతో ఆర్ బిఐ కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గించనుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి వార్షిక ద్రవ్యోల్బణం 7.78 శాతంగా ఉండేది. ఆహార పదార్ధాల, పప్పుల ధరలు 5 శాతం తగ్గాయి. టీ, పళ్లు, కూరగాయల ధరలు 3 శాతం క్షీణించాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా 7-8 శాతం క్షీణించాయి. అయినప్పటికీ నాప్తా, ఫర్నేస్ ఆయిల్, విద్యుత్ ధరలు పెరిగాయి.
News Posted: 19 March, 2009
|