ఫ్రాడ్ ను కనిపెట్టే ఏటిఎమ్
ముంబై: సౌకర్యం పెరిగే కొద్దీ తప్పుడు పనులు చేసేందుకు సౌలభ్యం కూడా పెరుగుతుందని ఒక నానుడి. వినియోగదారునికి మెరుగైన సేవలు అందించేందుకు ఉపకరించే ఏటిఎమ్ ల నుండి పెద్ద ఎత్తున డబ్బును తస్కరించే హైటెక్ దొంగ వెధవలు కూడా తయారయ్యారు. వీరిని కనుగొనేందుకు ఫ్రాడ్ ట్రాకింగ్ ఏటిఎమ్ లు ఉనికిలోకి వచ్చాయి. ఇలాంటి 400 ఏటిఎమ్ లను యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజ్ కు చెందిన ఎన్ సిఆర్ కార్పొరేషన్ అనే టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏటిఎమ్ లు వినియోగదారుని ఫోటోతో లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నిటిని రికార్డు చేస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ కోసం ఎన్ సిఆర్ పర్సోనా టిఎమ్ 77 సోలో ఏటిఎమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ సిఆర్ కార్పొరేషన్ ప్రకటించింది. బిల్లుల చెల్లింపులు, చెక్ డిపాజిట్లు, టికెట్ బుకింగులు, మొబైల్ టాప్ అప్ లాంటి లావాదేవీలను నిర్వహించే సాఫ్ట్ వేర్ తో సహా అప్ గ్రేడ్ చేసుకునేందుకు వీలయ్యే విధమైన ప్లాట్ ఫారాలు కూడా ఈ ఏటిఎమ్ ల్లో అమర్చారు. వినియోగదారుని కదలికల్ని పసిగట్టడం లేదా ఏటిఎమ్ కార్డును వాడుతున్న సమయంలో గాని లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని ఎన్ సిఆర్ ఏటిఎమ్ సర్వైలెన్స్ సొల్యూషన్స్ రికార్డు చేస్తాయి. ఈ సాఫ్ట్ వేర్ ఏటిఎమ్ లో అమరుస్తారు. ఏటిఎమ్ లో అత్యంత సూక్ష్మ రూపంలో ఈ చిత్రాలు నిక్షిప్తమవుతాయి. ఈ చిత్రాలు ఏటిఎమ్ మానిటర్ లో కనిపిస్తాయి.
News Posted: 19 March, 2009
|