ఏప్రిల్ 9న నానో బుకింగ్
ముంబై: ప్రతిష్టాత్మకమైన నానో కార్ల బుకింగ్ ఏప్రిల్ 9 నుండి ప్రారంభమై ఏప్రిల్ 23 వరకు సాగుతుంది. నానో కార్లను సోమవారంనాడు విడుదల చేయడానికి ముందుగా జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని టాటా మోటార్స్ చైర్మన్ రతన్ టాటా ప్రకటించారు. రోడ్డుపై అతి తక్కువ స్థలాన్ని ఆక్రమించే నానో కారును మొదటి ఒక లక్ష మంది కొనుగోలుదారులకు అందజేస్తున్నట్లు టాటా తెలిపారు. అయితే ఆ లక్ష మంది కొనుగోలుదారులకు అందజేసే ధరను త్వరలో ప్రకటించనున్నామని ఆయన తెలిపారు.
ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ ఒక లక్ష రూపాయలకు కారును అందజేస్తానని ప్రకటించిన హామీని నెరవేరుస్తున్నట్లు రతన్ టాటా తెలిపారు. అయితే ఈ మధ్య కాలంలో సరకుల ధర తగ్గడం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆయన తెలిపారు. జులై నెలారంభంలో నానో కార్లను కొనుగోలు దార్లకు అందజేయనున్నామని ఆయన తెలిపారు. భారత దేశంలో దాదాపు ఒక వెయ్యి నగరాల్లో 30వేల ప్రాంతాల వద్ద నానో కార్ల బుకింగ్ అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. 850 నగరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక బ్యాంకర్ గా బుకింగ్ లను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2,999 రూపాయలను మాత్రమే ముందస్తు చెల్లించి కార్లను బుక్ చేసుకోవవలసి ఉంటుంది. మిగిలిన మొత్తం బ్యాంకు రుణం కింద లభ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్ల కోసం 15 మంది ఫైనాన్షియర్లను ఎంపిక చేశారు. మూడు రోజుల్లో ఆ ఫైనాన్షియర్ల పేర్లను ప్రకటిస్తామని రతన్ టాటా తెలిపారు.
News Posted: 23 March, 2009
|