సత్యానికి 'విజయ' కాంట్రాక్ట్
హైదరాబాద్: సత్యం కంప్యూటర్ సంస్థ నిదానంగా వ్యాపారం పెంచుకుంటోంది. విజయ డైరీ అండ్ ఫార్మ్ ప్రాడక్ట్స్ సంస్థను ఆధునీకరించి, వ్యాపార ప్రక్రియలను అనుసంధానించే కాంట్రాక్టును సత్యం కంపెనీ కైవసం చేసుకుందని సోమవారంనాడు ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. సత్యం కంప్యూటర్స్ సంస్థ ఈ డైరీ సంస్థ కార్యకలాపానికి సాప్ (sap) సొల్యూషన్స్ ను అనువర్తింప చేస్తోంది. ఈ కాంట్రాక్టు ద్వారా ఆ డైరీ సంస్థను ఆధునీకరించి, దేశ వ్యాప్తంగా దాని వ్యాపార ప్రక్రియలను అనుసంధానించడం ద్వారా నిర్వహణ వ్యయాన్ని తగ్గించే పని చేపడుతుందని సత్యం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
సత్యం సంస్థ ఈ కాంట్రాక్టుతో ముడిపడిన ఆర్ధిక వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. వేల కోట్ల రూపాయల అకౌంటింగ్ కుంభకోణంలో కూరుకుపోయి అల్లాడుతున్న సత్యం సంస్థకు ఈ డైరీ కాంట్రాక్ట్ కొంత ఊరటనిస్తుంది. జనవరి నుండి సత్యం ఖాతాదారులు చాలా మంది ఆ కంపేనీతో తెగదెంపులు చేసుకున్నారు. 'విజయ డైరీ అండ్ ఫార్మ్ ప్రాడక్ట్స్ ఎదుర్కొంటున్న సవాళ్లు మాకు అర్థమయ్యాయి. ఆ సంస్థ కొనుగోల్లు-అమ్మకాలకు సంబంధించిన మొత్తం ప్రక్రియను హేతుబద్దీకరించే సొల్యూషన్స్ ను మేము అందివ్వగలం' అని సత్యం సాప్ అండ్ మేనేజ్డ్ టెస్టింగ్ ప్రాక్టీస్ గ్లోబల్ హెడ్ మనీషా మెహతా తెలిపారు. 'మా కొనుగోలు-అమ్మకాల వ్యవహారం చాలా సంక్లిష్టమైంది. దాన్ని మరింత సులభతరం చేయడం ద్వారా నష్టాలను నివారించగలం' అని విజయ డైరీ అండ్ ఫార్మ్ ప్రాడక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జె మదన మోహన్ తెలిపారు.
News Posted: 23 March, 2009
|