'6 నెలల్లో పునర్వికాసం'
న్యూఢిల్లీ: ఉపా ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన ప్యాకేజీల ప్రభావంతో దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవనం చెందగలదని ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ప్రకటించారు.ద్రవ్యోల్బణం సున్నా స్థాయికి చేరుకోవడం వలన రైతాంగం ఆదాయాలు మెరుగుపడే అవకాశముందని ప్రధాని తెలిపారు. వచ్చే ఆరేడు మాసాల్లో భారత ఆర్ధిక వ్యవస్థ పునర్వికాసం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినియోగదారుల డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి తిరిగి పట్టాలెక్కే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగించారు.
డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వం రెండు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. ఎక్సైజ్ డ్యూటీని 4 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ వినిమయాన్ని పెంచడం, పన్నులేని బాండ్ లను పెంపొందించేందుకు ఐఐఎఫ్ సిఎల్ మౌలికసదుపాయాల ఫైనాన్స్ కంపెనీకి మరిన్ని అధికారాలను కట్టబెట్టడంతే ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడిందని ప్రధాని తెలిపారు. తదుపరి, ఎక్సైజ్ డ్యూటీపై 2 శాతం తగ్గింపు, సర్వీసు టాక్స్ తగ్గింపులాంటివి రెండవ ఉద్దీపన ప్యాకేజీలో చోటు చేసుకున్నాయి. ఇంధన ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం కిందకు దిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయు పెరిగేందుకు ఆహార పదార్ధాల ధరల్ని ప్రభుత్వం స్థిరంగా ఉంచిందని ప్రధాని తెలిపారు. దాంతో గ్రామీణుల ఆదాయాలు పెరిగాయని, వారిలో కొనుగోలు శక్తి పెరిగిందని ఆయన తెలిపారు.
News Posted: 24 March, 2009
|