ఇన్ఫోసిస్ సరికొత్త పథకం
న్యూయార్క్: తమ ఉద్యోగులందర్ని కొనసాగించాలన్న సదుద్దేశ్యంతో భారత ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. లేఆఫ్ తో ఇళ్లకు పంపకుండా కొంతమంది ఉద్యోగులను లాభాపేక్షలేని తన ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ)లో ఒక ఏడాది పాటు అర్థ జీతంతో పనిచేయాలని ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి కోరారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇలాంటి ఉదాసీనమైన ఆర్ధిక వాతావరణంలో ఇన్ఫోసిస్ ఇప్పటికీ ఉద్యోగ నియామకాల్ని చేస్తోందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'చాలా తక్కువమందిని' ఎంపిక చేస్తున్నట్లు కో చైర్మన్ తెలిపారు. 'ఈ రంగంలో ఉద్యోగుల్ని కాలేజి క్యాపంస్ ల నుండి ఎంపిక చేస్తాము. గత ఏడాది మార్చిలో ఎంపిక చేసిన 18 వేల మందికి పంపిన లెటర్లను మేము గౌరవిస్తాము. వారందరికి మేము ఉద్యోగాలను కల్పిస్తాము. మా ఉద్యోగులందరికి సరిపడ్డంత పని మావద్ద లేదు. అందువల్ల బహిరంగంగా ఆన్ లైన్ లాంటి మార్గాల ద్వారా లభించే పనిని ఎంపిక చేసుకోవలసిందిగా మేము ప్రోత్సహిస్తున్నాము. మరింత సృజనాత్మకంగా పనిచేయాలని వారిని ప్రోత్సహిస్తున్నాము' అని నిలేకణి తెలిపారు.
ప్రస్తుతం విజృంభిస్తున్న సంక్షోభంలో కొత్త అవకాశాలు ఎలా ఉన్నాయని అడిగిన ఫోర్బ్స్ ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా-'ఒక కంపెనీ సరఫరా యంత్రాంగాన్ని పునర్నిర్వచించడం లాంటి మరిన్ని వ్యాపార ఆధారిత ప్రాజెక్టులను మా కంపెనీ చేపట్టింది. ఫార్మాస్యూటికల్స్, సహజ వనరులు, మీడియా, అలాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు విస్తరించడం లాంటి పలు చర్యలు చేపట్టాము.' అని నీలేకణి తెలిపారు. ఇన్ఫోసిస్ కు వచ్చే ఆదాయంలో 88 శాతం అమెరికా, యూరప్ ల నుండే వస్తోందని, ఆర్ధిక సంక్షోభంతో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది 11-12 శాతం ఆదాయాలు పెరగలగలవని మేము ఆశించామని నిలేకణి తెలిపారు.
News Posted: 24 March, 2009
|