సత్యంకు స్పైస్ రాం రాం?
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ బిడ్డింగ్ వ్యవహారం పారదర్శకంగా, బహిరంగంగా లేకపోవడంతో ఈ లావాదేవీ నుండి తాను తప్పుకోవాలని యోచిస్తున్నట్లు స్పైస్ గ్రూపు బుధవారంనాడు ప్రకటించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ముందుకు వెళ్లే విషయాన్ని త్వరలో తేల్చుకోనున్నట్లు స్పైస్ తెలిపింది.
'ఈ బిడ్డింగ్ వ్యవహారం పారదర్శకంగా, బహిరంగా లేదని మేము భావిస్తున్నాము. బిడ్డర్స్ జాబితాను మరోసారి కుదిస్తున్నట్లు సత్యం ప్రకటించింది. అయితే అంతకుముందు జాబితా నుండి ఎవరెవరిని తొలగించింది ఇంతవరకు బహిర్గతం కాలేదు.సత్యం బిడ్డింగ్ ప్రక్రియలో ముందుకు వెళ్లే విషయంపై మా కంపెనీ బోర్డు త్వరలో సమావేశం కానుంది.సత్యం బిడ్డింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు మాకు సంతృప్తికరంగా లేవు.' అని స్పైస్ గ్రూప్ చైర్మన్ బికె మోడి తెలిపారు. స్పైస్ గ్రూప్ బోర్డు ఈ సమస్యపై ఒక రోజులో నిర్ణయం తీసుకోనుంది.
తాజాగా సత్యం బోర్డు చేపట్టిన బిడ్డర్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన విధివిధానానలను స్పైస్ బోర్టు కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. దాంతోపాటు బిడ్డింగ్ కు సంబంధించిన ఇతరత్రా సమస్యలను సైతం స్పైస్ బోర్డు లోతుగా పరిశీలించనుంది. సత్యం సవరించిన బిడ్డర్ల జాబితాలో స్పైస్, లార్సన్ అండ్ టూబ్రో, టెక్ మహీంద్ర సంస్థలు కూడా ఉన్నాయి.
News Posted: 25 March, 2009
|