పెరిగిన ఖాదీ సేల్స్
న్యూఢిల్లీ: ఎన్నికల దెబ్బకు ఖద్దరు బట్ట అమ్మకాలు 25 శాతానికి పెరిగాయి. ఖాదీ గ్రామ ఉద్యోగ్ సంస్థ అంగళ్లకు తీరిక లేకుండా పోయింది. చిన్న పెద్ద రాజకీయ నాయకులందరూ ప్రచార సమయాల్లో ముఖ్యంగా ఖద్దరు బట్టలు వేస్తుండడంతో మార్చి నెలలో ఖాదీకి విపరీతమైన గిరాకి వచ్చింది. ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ (కెవిఐసి) సంస్థకు చెందిన ఖాదీ భవన్ మార్చి నెల తొలి మూడు వారాల్లో 1.60 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు తెలిపింది.
గత ఏడాది ఇదే మాసంలో జరిగిన అమ్మకాల కంటే ఈ ఏడాది మార్చి నెల అమ్మకాలు దాదాపు 25 శాతం పెరిగినట్లు కెవిఐసి డైరెక్టర్ ఎస్ పి సింగ్ తెలిపారు. రాజకీయ నాయకుల ట్రేడ్ మార్క్ డ్రెస్ గా ఉండే ఖాదీ అమ్మకాలే కాకుండా, జెండాల అమ్మకాలు కూడా దాదాపు 5 శాతం పెరిగినట్లు సింగ్ తెలిపారు. కెవిఐసి పలు రాజకీయ పార్టీల నుండి తాజా ఆర్డర్లను తీసుకుంటోంది. కెవిఐసి పలు రాష్ట్రాల చేతివృత్తుల వారి నుండి బట్టల్ని సేకరిస్తుంది.
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాల నుండి ఖాదీ సిల్క్ బట్టల్ని సేకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి ఖాదీ కాటన్ బట్టను కెవిఐసి సేకరింస్తుంది. గుజరాత్, రాజస్తాన్లు స్పిన్ ఖాదీలకు ప్రసిద్ధి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్ చేతి వృత్తుల వారు ఉన్ని బట్టలకు ప్రసిద్ధి. ఏప్రిల్ 16 నుండి నాలుగు దఫాలు మే 13 వరకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. 1920లో ఖాదీని ఒక రాజకీయ ఆయుధంగా మహాత్మా గాంధీ ప్రవేశపెట్టారు. 'స్పేచ్చకు సాధంనంగా' ఖాదీ బట్టను గాంధీ వర్ణించారు.
News Posted: 25 March, 2009
|