సిఎమ్ కు ఫ్యాప్సీ వినతి
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలసి తమ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా సోమవారంనాడు వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం విద్యుత్ కోత మూలంగా ఎదుర్కుంటున్న కష్టాలను ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ అగర్వాల్ సారధ్యంలో ఈ ప్రతినిధి బృందం సిఎమ్ కు ఏకరువు పెట్టారు.ప్యాప్సీ, ఫ్యాప్సియా సంస్థలు సంయుక్తంగా గతంలో సిఎమ్ డిలను, ఏపిట్రాన్స్ కో, ఏపిసిపిడిసిఎల్ ఉన్నతాధికారులను కలసి పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూలకషంగా చర్చింనట్లు అగర్వాల్ తెలిపారు.
విద్యుత్ కొరత కారణంగా విద్యత్ కోత తప్పనప్పటికీ తక్కువ నష్టంతో, తక్కువ అంతరాయలతో కూడిన విద్యుత్ కోత విధానాన్ని చేపట్టాలని ఆ సంస్థలకు సూచించినట్లు అగర్వాల్ తెలిపారు. సిఎమ్ డి, ఎపిసిపిడిసిఎల్ సంస్థలతో చర్చించిన సందర్భంలో ముందుకొచ్చిన విద్యుత్ సరఫరా ప్రత్యామ్నాయలను, ఇతర రాయితీలను ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో పొందుపరిచామని అగర్వాల్ తెలిపారు. ఎస్ ఎమ్ఈ రంగంలో, పూర్తి స్థాయి ప్రాసెస్ పరిశ్రమల విషయంలో ఎలాంటి విద్యుత్ కోత విధానాన్ని అనుసరించాలన్న విషయాన్ని ఆ ప్రతినిది బృందం సూచించింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటరీ కమీషన్ లు నాణ్యమైన విద్యుత్ ను పంపిణీ చేయడంలో విఫలమవుతున్నాయి. అందువలన వాస్తవంగా వినియోగించిన విద్యుత్ ను అంచనా వేయడం ద్వారా విద్యత్ బిల్లులను తయారు చేయాలని ఆ వినతి పత్రంలో ప్రభుత్వానికి నివేదించారు.
విద్యుత్ సుంకాన్ని యూనిట్ పై 0.25 పైసలు తగ్గించాలని ఫ్యాప్సీ కోరింది. విద్యుత్ రంగంలో వ్యాట్ ను అమలు చేయాలని ఆ బృందం కోరింది. బొగ్గును వినియోగించే పరిశ్రమలకు బొగ్గును సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని వారు తెలిపారు. కెజి బేసిన్ వద్ద ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ను రాష్ట్ర పరిశ్రమలకు అందేయాలని ఫ్యాప్సీ కోరింది. ఆయా రంగాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో కలసి ఈ డిమాండ్లపై చర్చించి పరిష్కరించుకోవలసిందిగా ముఖ్యమంత్రి ఆ ప్రతినిధి వర్గాన్ని కోరారు.
News Posted: 25 March, 2009
|