'నానో' వేలంవెర్రి
వదోదర:కార్ల ప్రియులను నానో కారు వెర్రెక్కిస్తోందనడంలో అతిశయోక్తి లేదేమో. నానో కారును కొనుగోలు చేసేందుకు సిటీలోని హొమాయ్ వ్యారవాలా అనే 96 ఏళ్ల వృద్ద ప్రెస్ ఫోటోగ్రాఫర్ తన 55 ఏళ్ల నికార్సయిన ఫియట్ కారును అమ్మివేశారు. ముంబైకి చెందిన వింటేజ్ కార్ల ప్రేమికునికి తన ఫియేట్ కారును అమ్మివేసినట్లు వ్యారవాలా తెలిపారు. ఆ సొమ్ముతో నానో కారు కొనుగోలు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. తన ఫియేట్ కారును రిపేర్ చేయించడం కష్టంగా మారిందని ఆమె తెలిపారు.
తన ఫియేట్ కారును 55 ఏళ్ల క్రితం ఇటలీ నుండి సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకున్నట్లు వ్యారవాలా తెలిపారు. ఆమె దేశంలోని తొలి మహిళా ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్ లాంటి స్వదేశి ప్రముఖుల, భారత దేశాన్ని దర్శించిన పలువురు విదేశీ ప్రముఖల చిత్రాలను ఆమె తీశారు. ఆమె తీసిన పలువురు ప్రముఖుల చిత్రాలతో ఒక ఆల్బమ్ ను తయారుచేసారు.
'నానో కారు రిజస్ట్రేషన్ ప్రారంభం అయిన వెంటనే నేను నానో కారును బుక్ చేసుకుంటాను. కారు కోసం వేసి చూస్తాను' అని ఆమె ప్రకటించారు. నానో కారును డ్రా ద్వారా కేటాయిస్తారు. ఈ డ్రాలో నానో కారును తాను తప్పక పొందగలనన్న విశ్వాసాన్ని వ్యారవాలా వ్యక్తం చేశారు. తన కారును తానే నడపుతానని ఆమె తెలిపారు. రతన్ టాటాను కలసి పద్దతికి విరుద్ధంగా తాను నానో కారును కొనుగోలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. నగరంలోని నిజాంపురా ప్రాంతంలో వ్యారవాలా ఒకరే తన నివాసంలో గడుపుతున్నారు.
News Posted: 25 March, 2009
|