నానో ఆన్ లైన్ బుకింగ్
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ రంగ చరిత్రలోనే ప్రథమంగా నానో కార్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు టాటా మోటార్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. రిస్ట్ వాచ్ లు, టి షర్టులు, ఫోన్లు లాంటి వస్తువులను ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసుకున్నట్లుగా నానో కార్లను కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు అనువుగా టాటా మోటార్స్ సంస్థ ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. నానో కారును కొనుగోలు చేయదలచుకున్న వారికి అందుకు తగిన విధివిధానాలు ఈ సైటులో దొరుకుతాయి. ఏప్రిల్ 9-25 తేదీల లోపల నానో కోసం అభ్యర్ధించే అవకాశముంటుంది.
భవిష్యత్ వ్యాపార ధోరణులను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ పద్ధతిని ఎంచుకున్నట్లు ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన ఆన్ లైన్ బుకింగ్ పద్ధతికి మంచి స్పందన రాగలదని ఆయన అంచనా వేస్తున్నారు. తీరికలేని పలువురు వ్యక్తులకు ఆన్ లైన్ బుకింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. ఆన్ లైన్ బుకింగ్ లో అప్లికేషన్ ఫీజు కేవలం 200 రూపాయలు మాత్రమే. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వెస్ట్ వైడ్ అప్పారల్ స్టోర్స్, క్రోమా అవ్లయెన్సస్ చైన్, టైటాన్ షో రూమ్ ల్లో నానో అప్లికేషన్ ఫార్మ్స్ కు 300 రూపాయలు ఖర్చవుతుంది. ఆన్ లైన్ వర్చువల్ షో రూమ్ లో నానో కారుకు సంబందించిన పలు విశిష్టతలను తీరిగ్గా పరిశీలించే అవకాశముంది.
అదే సమయంలో నానో ఆన్ లైన్ బుకింగ్ తో పాటు 15 ఫైనాన్స్ సంస్థల ద్వారా ఆన్ లైన్ పైనాన్సింగ్ ఏర్పాటుకు కూడా టాటా మోటార్స్ శ్రీకారం చుట్టింది. ఆన్ లైన్ కస్టమర్స్ బుకింగ్ ఫీ కోసం 2999 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది. సెల్ప్ ఫైనాన్స్ ఆప్షన్ కంటే దాదాపు 75 శాతం తగ్గించి చెల్లించవలసి ఉంటుంది. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఏర్పాటుకు మంచి స్పందన వచ్చే అవకాశముందని పలువురు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మొదటి దశలో విడుదల చేస్తున్న ఒక లక్ష కార్లకు గాను దాదాపు 3 లక్షల అప్లికేషన్స్ ద్వారా 950 కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ కావచ్చని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది.
News Posted: 27 March, 2009
|