జిఎమ్ కు కొత్త సిఈఓ
వాషింగ్టన్: అమెరికా ఆటో రంగంలో ఒబామా మరమ్మతులు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోరడంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ జిఎమ్ చైర్మన్, సిఈఓ రిక్ వాగొనర్ జోడు పదవుల నుండి వైదొలగారు. ఆయన స్థానంలో ఫ్రిట్జ్ హెండర్సన్ కొత్త సిఈఓగా నియమితులైనట్లు జిఎమ్ సోమవారంనాడు ప్రకటించింది. హెడర్సన్ కంపెనీలో నిర్వహిస్తున్న బాధ్యతల నేపథ్యంలో సిఈఓ స్థానానికి ఎంపిక చేశారు. వైస్ చైర్మన్ గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఆయన జోడు పదవులు నిర్వహించేవారు. దెబ్బతిన్న అమెరికా ఆటోమొబైల్ రంగాన్ని తిరిగి పట్టాలెక్కించే భవిష్యత్ పథకాన్ని ప్రకటించేందుకు ఒకరోజు ముందుగా జిఎమ్ ఉదంతాన్ని పొలిటికో.కామ్ ప్రముఖంగా ప్రచురించింది.
ఒబామా ప్రభుత్వం సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సరికొత్త ఆటోమొబైల్ పథకాన్ని ప్రకటించనుంది. జనరల్ మోటార్స్, క్రిస్లర్ సంస్థలు బెయిల్ ఔట్ ప్యాకేజి నుండి కోట్లాది డాలర్లను ఆర్జించాయే కాని, కంపెనీల్లో తగినంత పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టలేదని ఒబామా ప్రభుత్వం ఆ కంపెనీలను తప్పుపట్టింది. 'ఆ కంపెనీలు పునర్నిర్మాణాన్ని చేపట్టడంలేదు. విజయవంతమైన ఆటో పరిశ్రమ మనకుండాలని మనం ఆలోచిస్తున్నాము. అయితే ఈ రెండు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లు తమను తాము విప్లవీకరించుకునే ప్రయత్నాలు చేయడంలో వెనకబడిపోయాయి. ఈ గండం నుండి గట్టెక్కేందుకు మరింత అర్థవంతమైన చర్యల్ని చేపట్టవలసి ఉంటుంది. మరింత పోటీతత్వాన్ని అలవర్చుకావాలి. మరింత చొరవను ప్రదర్శించాలి.' అని ఆదివారంనాడు సిబిఎస్ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడారు.
పుర్నిర్మాణం విషయంలో వెనకబడిపోయినందుకు ఆ రెండు కంపెనీలను ఒబామా ప్రభుత్వం హెచ్చరించింది. రెండవ బెయిల్ ఔట్ ప్యాకేజి కింత 21.6 బిలియన్ డాలర్ల రుణాలను ప్రభుత్వం అందజేయకపోతే, ఇప్పటికే దివాళా అంచుకు చేరిన ఆ రెండు కంపెనీలకు పుట్టగతులుండవని ప్రభుత్వంతీవ్రంగా హెచ్చరించింది.ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంపై ఒబామా టాస్క్ ఫోర్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన మూల స్థంభంగా ఉన్న ఆటోమొబైల్ పారిశ్రామిక రంగం ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా కుప్పకూలింది.
News Posted: 30 March, 2009
|