ముంబై: ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి దేశ ఆర్ధిక వ్యవస్థను రక్షించే పని దృష్ట్యా కీలకమైన ఆర్ధిక సంస్కరణను చేపట్టడంలో ఆలస్యమైందని ఆర్ బిఐ సోమవారంనాడు ప్రకటించింది. మందగిస్తున్న దేశ ఆర్ధిక పురోగతిని అడ్డుకుని తిరిగి పట్టాలెక్కించేందుకు ద్రవ్య సంస్కరణల సరిపోవని రిజర్వు బ్యాంకు ఆ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సంక్షోభ గండం దాటిపోయిన తర్వాత మాత్రమే ద్రవ్య క్రమశిక్షణ సాధించగలమని ఆర్ బిఐ తెలిపింది. ఆర్ధిక వృద్ధి రేటును సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కొన్ని ద్రవ్య నియంత్రణ చర్యలను చేపట్టవలసి ఉంటుందని ఆ ప్రకటన తెలిపింది.
గత కొంత కాలంగా బాగా లాభాల్ని గడించిన ప్రభుత్వ ఆదాయాలు 2008-09 ఆర్ధిక సంవత్సరంలో మార్చి 31 నాటికి దెబ్బతిన్నాయి. ఆర్ధిక పురోగతి మందగించిన సమయంలో ప్రభుత్వ ఖర్చులు సహజంగా పెరుగుతాయి. 2008-09 ఆర్ధిక సంవత్సరంలో కనీసం 6 శాతం ఆర్ధిక పురోగతిని సాధించేందుకు కూడా ప్రభుత్వం శ్రమపడవలసి వస్తోంది. ఆయిల్ సబ్సిడీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య లోటు కూడా కలిపితే మొత్తం లోటు జిడిపిలో 10 శాతం ఉన్నట్లు అంచనచాలు తెలియజేస్తున్నాయి. దేశ ద్రవ్య వ్యవస్థపై ఆరు సంపుటాల సమగ్ర నివేదికను ఆర్ బిఐ విడుదల చేసింది. ఈ నివేదికను రూపొందించేందుకు ప్రభుత్వం ఒక కమిటీ వేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ సారధ్యంలో ప్రభుత్వం 2006లో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ పూర్తి నివేదిక ఆర్ బిఐ వెబ్ సైట్ లో దొరుకుతుంది.