గూగుల్ వెంచర్స్ ప్రారంభం
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం కొత్తగా వెంచర్ కేపిటల్ ఫండ్ ను ప్రారంభించింది. అద్భుతమైన శక్తి సామర్ధ్యాలు గల యువ కంపెనీలకు సహాయం చేసేందుకు ఈ కేపిటల్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. సాఫ్ట్ వేర్, క్లీన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, వినియోగదారుల ఇంటర్నెట్ లావాదేవీలు వగైరా రంగాల్లోని ఒత్సాహిక పరిశ్రమలను కనుగొని వ ాటికి సహాయం చేయడంపై గూగుల్ వెంచర్స్ కేంద్రీకరిస్తుంది.
'ఆర్ధికంగా గడ్డుకాలం సాగుతున్నప్పటికీ, అలాంటప్పుడే గొప్ప భావాలకు అంకురార్పణ జరుగుతుంది' అని గూగుల్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్లు రిచ్ మైనర్, బిల్ మారిస్ లు యుఎస్ ఇంటర్నెట్ అనే ప్రముఖ వెబ్ సైట్ లో రాశారు. 'ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సామర్ధ్యం ఉన్న తాజా కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనువైన సమయమిది. భవిష్యత్ లో పెద్ద కంపెనీలు గా ఎదగగల్గే శక్తి సామర్ధ్యాలను గుర్తించడమనేది కీలక విషయం. అలాంటి కంపెనీలను గుర్తించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాము' అని వారు తెలిపారు.
గూగుల్ వెంచర్స్ కంపెనీ అత్యున్నత వెంచర్ కేపిటల్ సంస్థలతో కూడా కలసి పనిచేసేందుకు సిద్దంగా ఉంది. గూగుల్ సంస్థకు ఉన్న తిరుగలేని సాంకేతిక నైపుణ్యం, ప్రతిష్టలను ఆ కంపెనీలకు అందించనుంది. 'మా గూగుల్ వినియోగదారులు (గూగులర్స్) మాకు అండదండగా ఉంటారు. ఎలాంటి రంగాల్లో, ఎలాంటి సంస్థల్లో పెట్టుబడి మదుపు చేయవలసిన విషయంపై వారు నిరంతరం మాకు సలహాలిస్తుంటారు. అలాంటి సలహాలను పరిగణనలోకి తీసుకుని, వాస్తవ పరిస్థితిని మధించి మేము నిర్ణయాలు తీసుకుంటాము' అని మైనర్, మారిస్ లు రాశారు. సలహాలిచ్చేందుకు ముందుకొస్తున్న వినియోగదారులు కంపెనీ వెబ్ సైట్ కు తమ అభిప్రాయాలను పంపాలి.
News Posted: 31 March, 2009
|