ఏ ఏటిఎం అయినా ఓకె
న్యూఢిల్లీ: ఏటిఎమ్ కార్డు హోల్డర్లు తమ బ్యాంకుల ఏటిఎమ్ ల కోసం వెతికే తిప్పలు తప్పనున్నాయి. ఏటిఎమ్ కార్డు జారీ చేసిన బ్యాంకు నుండి మాత్రమే ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండా డ్రా చేసే వీలుండేది. ఇతర బ్యాంకుల ఏటిఎమ్ ల నుండి డబ్బు డ్రా చేయవలసి వస్తే సదరు వినియోగదారుడు అదనపు చార్జీలు చెల్లించవలసి ఉండేది. ఆ తిప్పలు బుధవారంతో తీరిపోతాయి. ఏ ఏటిఎమ్ నుండైనా చార్జీలు చెల్లించకుండా డబ్బును డ్రా చేసే సదుపాయాన్ని రిజర్వ బ్యాంకు కల్పించింది. ఆ మేరకు ఆదేశాలను ఆర్ బిఐ జారీ చేసింది.
ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇతర బ్యాంకుల ఏటిఎమ్ వినియోగదారలకు అందించే సేవలకు గాను చార్జీలను వసూలు చేయరాదని ప్రభుత్వ-ప్రైవేట్ రంగ బ్యాంకుల్ని రిజర్వ్ బ్యాంకు కోరింది. ఈ విధానం వలన సామాన్యుని చాలా ఉపశమనం కలుగుతుంది. బ్యాంకులన్నిటి ఏటిఎమ్, డెబిట్ కార్డులన్నిటికి ఈ విధానం వర్తిస్తుంది. క్రెడిట్ కార్డులకు, దేశానికి వెలుపల వినియోగించే ఏటిఎమ్ కార్డులకు మాత్రం ఈ విధానం వర్తించదు. ఈ పరిస్థితుల్లో కొన్ని బ్యాంకులు తమ ఏటిఎమ్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి.
ఓరియంటల్ బ్యాంకు తన ఏటిఎమ్ పునాది విస్తరించడంలో భాగంగా 60 కొత్త ఏటిఎమ్ లను ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది ఇతర బ్యాంకుల ఏటిఎమ్ వినియోగదారుల నుండి వసూలు చేసే చార్జీలను 20 రూపాయలకు ఆర్ బిఐ కుదించింది. అదే సమయంలో ఖాతాలోని నగదు నిల్వను చూసుకునేందుకు ఏటిఎమ్ వినియోగించినట్లయితే చార్జీలను వసూలు చేయరాదని ఆనాడు ఆర్ బిఐ నిర్ణయించింది. పలు బ్యాంకులు ఇప్పటికే ఇంటర్ బ్యాకింగ్ నెట్ వర్క్ ల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
News Posted: 31 March, 2009
|