జిడిపి తగ్గుముఖం
వాషింగ్టన్: భారత ఆర్ధికాభివృద్ది రేటు ఈ ఆర్ధిక సంవత్సరం మరింతగా క్షీణించనుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2008లో 5.5 శాతంగా ఉన్న ఆర్ధిక పురోగతి 2010లో 7 శాతానికి చేరుకునే ముందుగా 2009లో 4 శాతానికి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ప్రపంచ ఆర్దిక సంక్షోభం ప్రభావంతో భారత ఆర్ధిక వ్యవస్థలో కూడా మాంద్యంపు ఛాయలు చోటు చేసుకున్నాయని మంగళవారంనాడు విడుదలైన ప్రపంచ బ్యాంకు అంచనా పత్రం వివరించింది.
అభివృద్ది చెందుతున్న దేశాల సగటు స్థూల దేశీయోత్పత్తి 2009 లో 2.1 శాతానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అయితే చైనా, భారత దేశాల ఆర్ధికాభివృద్ది రేట్లను మినహాయించి గత ఏడాది 4.6 శాతంగా ఉన్న అబివృద్ధి చెందుతున్న దేశాల ఆర్ధికాభివృద్ధి రేటు గత అంచనాలకు భిన్నంగా 2.67 శాతానికి క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబుతున్నాయి. 2009లో అభివృద్ది చెందుతున్న దేశాల ఆర్ధికాభివృద్ధి రేటు 4.4 శాతంగా ఉండొచ్చని 2008 నవంబర్ ప్రపంచ బ్యాంకు నివేదిక వేర్కొంది. అయితే ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో సదరు అంచనాలన్ని తారుమారైనాయి.
ప్రపంచ ఆర్ధికాభివృద్ధి 2009 ఆర్ధిక సంవత్సరంలో 1.7 శాతానికి క్షీణిస్తుందని గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్స్ తాజా అంచనాలు తెలియ జేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుధ్దం తర్వాత ఇంత పెద్ద ఎత్తున జిడిపి ఎప్పుడూ క్షీణించలేదు. ఓఈసిడి దేశాల ఆర్ధికాభివృద్ధి రేటు 3 శాతానికి, ఇతర ఉన్నత ఆదాయాల ఆర్ధిక వ్యవస్థల పురోభివృద్ది రేటు 2 శాతానికి క్షీణిస్తాయని ఆ నివేదిక పేర్కొంది. 2010 నాటికి కూడా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బలహీనంగానే పురోగమిస్తుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. అయితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పూర్వ స్థితికి రావడానికి పట్టే కాలం పూర్తిగా అనిశ్చితంగా ఉంది.
News Posted: 31 March, 2009
|