సత్యం రేసులో 'రాస్'
ముంబై: సత్యం కంప్యూటర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ డబ్ల్యూఎల్ రాస్ అండ్ కో కూడా పోటీలోకి దిగింది. సత్యంకు సంబధించిన మెజారిటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు పత్రికా కథనం మంగళవారంనాడు వెలుగులోకి వచ్చింది. ఇబ్బందుల్లో కూరుకుపోయిన కంపెనీలను అమెరికా ఇన్వెస్టర్ విల్బర్ రాస్ సారధ్యంలో నడిచే డబ్ల్యూఎల్ రాస్ సంస్థ స్వాధీనం చేసుకుని లాభాల పంట పండిస్తోంది. రాస్ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లోని సత్యం కేంద్ర కార్యాలయాన్ని సైతం సందర్శించినట్లు బిజినెస్ లైన్ తెలిపింది.
సత్యం ప్రతినిధులు గాని, రాస్ కంపెనీ ప్రతినిధులు గాని ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. సత్యం బిడ్డర్లలో భారత ప్రముఖ ఇంజినీరింగ్ కాంగ్లామరేట్ లార్సన్ అండ్ టూబ్రో, ఐటి సంస్థ టెక్ మహీంద్రలు ఈ పోటీలో ఉన్నారు. సత్యం ఆస్తుల విలువ గత మేలో 7 బిలియన్ డాలర్ల నుండి 520 మిలియన్ డాలర్లకు క్షీణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు సారధ్యంలో ప్రస్తుతం సత్యం కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
News Posted: 31 March, 2009
|