న్యూఢిల్లీ: భారత దేశ ఫిబ్రవరి నెల ఎగుమతులు 21.7 శాతం క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లలో డిమాండ్ మందగించడంతో భారత దేశ ఎగుమతులు అయిదు నెలలపాటు వరుసగా క్షీణించాయి. గత ఏడాది 15.22 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఆర్ధిక సంవత్సరం ఫిబ్రవరి నెలలో 11.91 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. అదే సమయంలో దిగుమతులు 23.3 శాతం క్షీణించాయి. 21.93 బిలియన్ డాలర్ల దిగుమతులు ఫిబ్రవరి నాటికి 16.82 బిలియన్ డాలర్లకు క్షీణించినట్లు గణాంకాలు తెలియజేశాయి. 2008 అక్టోబర్ లో భారత ఎగుమతులు 12.1 శాతం క్షీణించి 12.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత అయిదేళ్ల కాలం తొలిసారిగా ఎగుమతుల్లో అపసవ్య ధోరణి కనపడింది.
ఏప్రిల్-ఫిబ్రవరి మధ్యకాలంలో దేశ ఎగుమతులు 7.3 శాతం అంటె 156.59 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ఎగుమతులు 30.9 శాతం పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు 19.1 శాతం 271.68 బిలియన్ డాలర్లుకు పెరిగాయి. 2007-08 ఆర్ధిక సంవత్సరంలోని 82.20 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 115.09 బిలియన్ అమెరికన్ డాలర్లుకు పెరిగింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో అక్టోబర్ నుండి భారతీయ ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు.