మారుతి 800కు చెల్లు చీటీ
న్యూఢిల్లీ: నవ భారత వ్యక్తిగత రవాణాకు నాంది పలికిన వాహనంగా పేరుగాంచిన మారుతి-800 కారు ఇక కనుమరుగు కానుంది. ఈ ప్రక్రియ 2010 నుండి ప్రారంభించి, క్రమంగా 2016 నాటికి ఈ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని మారుతి సుజకి ఇండియా (ఎమ్ఎస్ఐ) కంపెనీ నిర్ణయించుకుంది. భారత దేశంలో కొత్తగా రూపొందుతున్న కాలుష్య నియంత్రణ చట్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి-800 తోపాటు రెండవ పాత నమూనా, యుటిలిటీ వ్యాన్ 'ఓమినీ' ఉత్పత్తిని కూడా అదే సమయంలో, అదే కారణంగా నిలిపివేస్తున్నట్లు ఎమ్ఎస్ఐ కంపెనీ బుధవారంనాడు ప్రకటించింది.
ఈ రెండు వాహనాల ఉత్పత్తి నిలిపివేత ప్రక్రియలో మొదటి దశగా -దేశంలోని 11 నగరాల్లో వాటి అమ్మకాలను వచ్చే ఏడాది నుండి రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2015-16 నాటికి భారత్ స్టేజి-4 కాలుష్య నిబంధనలు అమలులోకి రానున్నాయి. భారత్ స్టేజి-4 నిబంధనలు యూరో-4 నిబంధనలను పోలి ఉంటాయి. ఎమ్-800, ఓమ్నీ కార్లు ఈ నిబంధనల పరిధిలోకి రాకపోవడంతో ఎమ్ఎస్ఐ సంస్థ ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేసేందుకు నిర్ణయించుకుందని ఆ సంస్థ చైర్మన్ ఆర్ సి భార్గవ తెలిపారు. అందువల్ల ఈ రెండు నమూనాలకు సంబంధించిన ఇంజన్లను సైతం కంపెనీ ఆధునీకరించడం లేదని ఆయన తెలిపారు.
News Posted: 1 April, 2009
|