సత్యం ఉద్యోగుల 'వలస'
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ నుండి దాదాపు 13 వేల మంది ఉద్యోగులు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సత్యం ఖాతాదారు సంస్థల్లోకి లేదా పోటీ సంస్థల్లోకి ఆ ఉద్యోగులు వెళ్లినట్లు ఒక నివేదిక గురువారంనాడు వెల్లడించింది. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు తన మోసాన్ని బయటపెట్టిన రోజున కంపెనీలో 53 వేల మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది మార్చి చివరినాటికి వారి సంఖ్య 40 వేల మందికి తగ్గినట్లు 'ఇండియా మింట్' వాణిజ్య పత్రిక గురువారంనాడు తెలిపింది.
కుంభకోణం, నిధుల కొరత సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న సత్యం కంపెనీనిలో 51 శాతం వాటాను కొనుగోలు చేసే తగిన ఇన్వెస్టర్ కోసం ప్రభుత్వం నియమించిన సత్యం బోర్డు అన్వేషిస్తోంది. క్లయింట్లు, సిబ్బంది కంపెనీని వదలిపెట్టి వెళ్లిపోయారని ఆరోపిస్తూ సత్యం కొనుగోలు వ్యవహారం నుండి అమెరికా సంస్థ ఐ-గేట్ తప్పుకుంది. సత్యం ఉద్యోగులు ఆ సంస్థ ఖాతాదారు కంపెనీల్లో పనిచేసేందుకు వెళ్లిన సందర్భాలు 78 శాతం ఉన్నాయి.250-300 మంది సత్యం ఉద్యోగులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ లకు వలస వెళ్లినట్లు బుధవారంనాడు బిజినెస్ స్టాండర్డ్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ విషయాన్ని సత్యం ఉద్యోగులెవ్వరూ ధృవపరచలేదు.
News Posted: 2 April, 2009
|