రెండు రోజుల్లో ఎమ్ బిఏ
న్యూఢిల్లీ: శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు ప్రముఖ అమెరికా విద్యాసంస్థలు ఆర్ధిక మాంద్యం గడ్డు రోజులకు తగ్గట్టు ఎమ్ బిఏ కోర్సులను రూపొందించాయి. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆకర్షించే విధంగా హార్వార్డ్ బిజినెస్ స్కూల్, ఎమ్ఐటి స్లోవాన్, కెల్లాగ్ విద్యా సంస్థలు విలక్షణమైన ఎమ్ బిఏ కోర్సులను ప్రవేశపెట్టాయి. దాంతో ఈ కోర్సుల కోసం పలువురు ఎగబడుతున్నారు. బోస్టన్ కు చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ 'పాకెట్ ఎమ్ బిఏ' అనే కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు నడిచే కాలం రెండు రోజులు మాత్రమే.
'ఒక ఏడాది కాలం నడిచే ఎమ్ బిఏ కోర్సును సూక్ష్మాతి సూక్ష్మంగా కుదించి రెండు రోజుల్లోనే అవే ప్రమాణాలతో కూడిన ఎమ్ బిఏ శిక్షణను అందించాలనుకుంటున్నాము' అని హల్ట్స్ దుబాయ్ ఎమ్ బిఏ ప్రోగ్రాం డీన్- నిక్ వాండర్ వాల్ట్ తెలిపారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఆర్ధిక మాంద్యం అత్యన్నత స్థాయికి చేరిన ఇలాంటి సందర్భాలతో వ్యవహరించేందుకు ఎమ్ బిఏ కోర్సు చేయడం అత్యవసరమని పలువురు ఎగ్జిక్యూటివ్ లు భావిస్తుండడంతో ఈ కోర్సు కోసం గణనీయమైన సంఖ్యంలో అప్లికేషన్స్ వచ్చాయి. ఈ కల్లోల కాలంలో కోర్సులను చదవడంపై వినూత్నంగా ప్రేమ పెల్లుబికిందని హల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
అయితే ఇలాంటి రెండు రోజుల కోర్సులు భారత్ దేశానికి పనికిరావని పలువురు భారతీయ నిపుణులు తెలిపారు. 'ఈ మాంద్యం రోజుల్లో పలువురు పై చదువులు చదివేందుకు, వైవిధ్యభరితమైన చదువులు చదివేందుకు సిద్ధపడుతున్నారు. అయితే హల్ట్ కోర్సు ద్వారా ఒక వ్యక్తి సామర్ధ్యాలు అదనంగా పెరిగే అవకాశం లేదు.భారత దేశం విషయంలో ఇది ఖచ్చితంగా పనికిరాదు' అని ఢిల్లీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ (ఎఫ్ఎమ్ఎస్) ప్రొఫెసర్ నీరజ్ కుమార్ తెలిపారు. 'పాకెట్ ఎమ్ బిఏ లాంటి కోర్సులు కార్పొరేట్లకు చక్కగా ఉపయోగపడుతుంది. వ్యాపారంలో ప్రముఖల అవగాహనను తెలుసుకునేందుకు కార్పొరేట్లకు ఈ కోర్సు బాగా ఉపకరిస్తుంది' అని ఢిల్లీకి చెందిన ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ విద్యార్ధి కె మధుకర్ అనంత్ తెలిపారు. ఇలాంటి స్వల్పకాలిక ఎమ్ బిఏ కార్యక్రమాలను అందరూ ఆమోదించడం లేదు. చాలా మంది ఇలాంటివన్నీ మార్కెటింగ్ జిమ్మిక్స్ గా కొట్టిపారేస్తున్నారు.
News Posted: 16 April, 2009
|