మాంద్యం సుదీర్ఘం: ఫండ్
వాషింగ్టన్: ప్రపంచ ఆర్ధిక మాంద్యం సుదీర్ఘంగా కొనసాగనుందని, పునర్వికాసం మందగించనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గురువారంనాడు ప్రకటించింది. ద్రవ్య సంక్షోభం ప్రేరణతో ఈ ఆర్ధిక మాంద్యం ఏర్పడినందున సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముందని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నిర్లక్ష్యంగా అమెరికా అందజేసిన గృహ రుణాల వల్ల ఏర్పడిన ద్రవ్య సంక్షోభంతో ముడిపడిన మాంద్యాలు పరిష్కారం కావడం చాలా కష్టం. ఎందుకంటే, ఆ మాంద్యాలు బలహీనమైన డిమాండ్ పునాదిగా ఏర్పడుతాయి.
ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గుండెల్లో ఏర్పడిన ద్రవ్య సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో విస్తరించిన క్షీణతలు కలగలసి ఏర్పడిన ఈ ఆర్ధిక మాంద్యం, ఇదివరకెన్నడూ లేనంత ఘోరాతిఘోరంగా తయారైందని ఏప్రిల్ 22న ఐఎమ్ఎఫ్ విడుదల చేసిన ప్రపంచ ఆర్ధిక దృక్పథం నివేదిక తెలిపింది. మాంద్యం వ్యతిరేక విధానాలు మాంద్యం పురోగతిని మందగింప చేస్తాయేగాని, ఈ మాంద్యం నివారణ చర్యల ప్రభావం ద్రవ్య సంక్షోభంపై తక్కువగానే ఉంటుందని నిధి తెలిపింది. విత్త ఉద్దీపన ఆర్ధిక మాంద్యం జీవిత కాలాన్ని ప్రముఖంగా తగ్గించివేస్తుంది. అయితే రుణగ్రస్త దేశాలకు ఈ చర్యలు ఉపకరించవని నిధి తెలియజేసింది.
1929 నాటి మహా మాంద్యం తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదించుక పోవడం ఇదే ప్రథమం. 2009 నాటికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 0.5-1.0 శాతానికి కుదించుక పోయే అవకాశమున్నట్లు ఐఎమ్ఎఫ్ తాజా అంచనాలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ఏర్పడితే, అభివృద్ధి దేశాల ఆర్ధిక వ్యవస్థల పురోగతి మందగించాయి. దేశాలు తమ ద్రవ్య రంగాల్ని త్వరగా శుద్ది చేసుకోవాలని ఐఎమ్ఎఫ్ పిలుపిచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రమాదకరమైన ఆస్తుల్ని వెంటనే తొలగించడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ త్వరగా రుణ లావాదేవీలను నడిపేందుకు అనుకూలంగా మారుతుందని నిధి తెలిపింది.
News Posted: 17 April, 2009
|