మాంద్యం షాక్ లో మైక్రోసాఫ్ట్
రెడ్మండ్ (అమెరికా) : ఆర్థిక మాంద్యం దెబ్బతో ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ గిలగిలలాడుతోంది. గత మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ లాభం 32శాతం మేర తగ్గిపోయినట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అత్యంత లాభదాయక, సంపన్న సంస్థగా ఇప్పటికీ పరిగణనలో ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ గత ఇరవై మూడేళ్ళలో సంస్థ విక్రయాలు, లాభాలు తగ్గిపోయినట్లు ప్రకటించడం ఇదే తొలిసారి. గత సంవత్సరంతో పోల్చి రాబడి, లాభంలో కుడా ఆ సంస్థ తగ్గుదలను చూపించింది.
అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం దెబ్బ కారణంగా గత జనవరిలోనే ఐదు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించడం ఐటి రంగంలో పెను సంచలనంగా నిలిచింది. దానితో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరిట్ ఇంక్రిమెంట్లు తీసేస్తున్నట్లు వెల్లడించడమూ ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ ఆర్థిక మాంద్యం దెబ్బ మరికొన్నేళ్ళపాటు కొనసాగుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ స్టీవ్ బామర్ జర్మనీలో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు.
News Posted: 25 April, 2009
|