విద్య రుణాల రేట్లు తగ్గింపు
ముంబై : విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) విద్యా రుణాలకు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గిస్తూ ఈ వారంలోనే ప్రకటన చేయాలని యోచిస్తున్నది. దేశంలో వివిధ రుణాలు ఇస్తున్న బ్యాంకులలో అగ్రస్థానం ఎస్ బిఐదే. మే 1, సెప్టెంబర్ 30 మధ్య రుణాలు తీసుకునే విద్యార్థులు ఈ తగ్గింపు రేట్ల సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వారారంభంలోనే రేట్ల తగ్గింపుపై ప్రకటన చేయాలని ఎస్ బిఐ యోచిస్తున్నట్లు ఎస్ బిఐ అధికారి ఒకరు తెలియజేశారు. 'తగినన్ని ఆర్థిక వనరులతో ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే విద్యార్థులకు చేయూత ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. అన్ని కేటగరీల విద్యా రుణాలపై వడ్డీ రేట్లు 0.25 శాతం మేర తగ్గవచ్చు. 2009 మే, సెప్టెంబర్ మధ్య ఆమోదించే అన్ని విద్యా రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది' అని ఆ అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఎస్ బిఐ 11.75 శాతం నుంచి 13.25 శాతం వరకు రేట్లతో విద్యా రుణాలను అందజేస్తున్నది. విద్యార్థినులైతే అన్ని కేటగరీలలో విద్యా రుణాలను ఇంకా 0.5 శాతం తక్కువ రేటుకు పొందవచ్చు. రూ. 4 లక్షల వరకు విద్యా రుణాలకు ఏ విధమైన పూచీకత్తునూ చూపనక్కర లేదు. కాని రూ. 4 లక్షలు, రూ. 7.5 లక్షల మధ్య రుణాలకు మూడవ పార్టీ గ్యారంటీని చూపించవలసిన అవసరం ఉంటుంది. రూ. 7.5 లక్షలపై నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలకు రుణ గ్రహీతలు పూచీకత్తుగా ఇల్లు లేదా భూములు వంటి ఆస్తులు వేటినైనా చూపించవలసి ఉంటుంది. రుణాలను ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళలోగా తిరిగి చెల్లించవచ్చు.
News Posted: 26 April, 2009
|