'సత్యా'నికి ఊరట!
న్యూఢిల్లీ : సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఉద్యోగులు, ఆ సంస్థను కొనుగోలు చేసిన టెక్ మహీంద్రా సంస్థకు తాజాగా మరింత ఊరట కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టెక్ మహీంద్రా సంస్థ 'సత్యం'ను కొనుగోలు చేయడంతో క్లయింట్లు సత్యానికి గుడ్ బై చెప్పనున్నారంటూ వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ ఆ సంస్థకు ప్రధాన క్లయింట్లైన నెస్లే, నిస్సాన్, సిఐబిఎ సంస్థలు కాంట్రాక్టులను కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ విషయం సత్యం సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సత్యం నుంచి అప్లికేషన్ మేనేజ్ మెంట్ సేవలను ఆటో దిగ్గజం నిస్సాన్ అందుకుంటోంది. ఈ నెస్లే, నిస్సాన్, సిఐబిఎ సంస్థలు కీలకమైన కాంట్రాక్టులు ఇచ్చాయి. దీనికి తోడు నెస్లే సంస్థ ఏప్రిల్ నెలలో సత్యానికి అదనంగా మరి కొన్ని కాంట్రాక్టులు కూడా ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
సత్యానికి ఇంతకు ముందు ముఖ్యమైన క్లయింట్లుగా ఉన్న సంస్థలు తమ కాంట్రాక్టులను కొనసాగించడానికి మరికొన్ని అదనపు కాంట్రాక్టులు ఇవ్వడానికి సమ్మతించడంతో మరికొన్ని సంస్థలు కూడా సత్యానికి బాసటగా నిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సత్యం సంస్థలో మేనేజ్ మెంట్ కుంభకోణం వెలుగు చూసిన అనంతరం ఆ సంస్థ ఉద్యోగులపై కఠిన నిబంధనలు విధించిన యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్, జర్మనీలు ఇప్పుడు వీసా నిబంధనలను మరింతగా సరళతరం చేస్తాయన్న సూచనలు వస్తున్నాయి.
News Posted: 4 May, 2009
|