మూత దిశలో బిపిఒలు
హైదరాబాద్ : ఉద్యోగాల ఔట్ సోర్సింగ్ కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న చర్యలు, ఆర్థిక మాంద్యం కలగలిసి హైదరాబాద్ నగరంలోని 200 బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బిపిఒ) సంస్థలలో 90 శాతం సంస్థలకు మనుగడను కష్టం చేస్తున్నాయి. ఉప కాంట్రాక్టులపై పని చేసే బిపిఒ సంస్థలలో అత్యధిక సంఖ్యాకం అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. గత కొన్ని నెలలుగా వాటికి కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. అనేక సంస్థలు మూతపడే స్థితిలో ఉన్నాయి. లే ఆఫ్ లు తప్పనిసరి అవుతున్నాయి.
'నా కంపెనీకి అమెరికా నుంచి ప్రాజెక్టులు రావడం లేదు. సంస్థ మూతపడే స్థితికి చేరుకుంటున్నది' అని ఒక బిపిఒ సంస్థ ఉద్యోగి ప్రకాశరావు తెలియజేశారు. 'మరొక కెరీర్ అవకాశం కోసం అన్వేషించడం కూడా కష్టం అవుతున్నది. ఈ ఆర్థిక మాంద్యం సమయంలో ఉద్యోగాల మార్కెట్ పతన దశలో ఉండడం ఇందుకు కారణం' అని ఆయన పేర్కొన్నారు.
నగరంలో సుమారు 60 ప్రముఖ బిపిఒ సంస్థలు ఉప కాంట్రాక్ట్ పద్ధతిపై కార్యకలాపాలు సాగిస్తుంటాయి. వాటన్నిటిపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడుతున్నది. రెండు సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. సుమారు పది సంస్థలు మూతపడే స్థితిలో ఉన్నాయి. వ్యయ కర్తన చర్యలలో భాగంగా అవి తమ ఉద్యోగులలో అత్యధిక సంఖ్యాకులకు 'పింక్ స్లిప్'లు జారీ చేశాయి. అనేక సంస్థలలో ఎక్కువగా నష్టపోయింది మధ్య శ్రేణి ఉద్యోగులు, మేనేజర్లు. అయితే, కొద్ది మంది సీనియర్లకు రెండు శాతం నుంచి ఐదు శాతం వరకు కనీసంగా వేతనం పెంచారు. వారు సంస్థను వదలిపోకుండా చూసుకోవడానికే ఇలా చేశారు.
పన్ను రాయితీలను తగ్గించాలన్న అమెరికా నిర్ణయం పర్యవసానంగా రాష్ట్రంలో బిపిఒ రంగంలో లే ఆఫ్ లు సహజమేనని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ఉన్నత స్థాయి అధికారులు అంటున్నారు. 'ఐటిఇఎస్ రంగంపై దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో 90 శాతం బిపిఒ సంస్థలు అమెరికాపై ఆధారపడి ఉన్నాయి' అని రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు డాక్టర్ సి.ఎస్. రావు చెప్పారు. 'అయితే, పెరిగిన ఉత్పాదకత, కస్టమైజ్డ్ పరిష్కారాలతో పరిస్థితి మెరుగుపడగలదు' అని ఆయన సూచించారు.
అయితే, ఉద్యోగాల ఔట్ సోర్సింగ్ సంస్థలకు అమెరికా పన్ను రాయితీలు తగ్గించడం పట్ల హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంఘం (హెచ్ వైఎస్ఇఎ) అంతగా కలవరపడడం లేదు. 'రాయితీలు లేకుండా చేయడం వల్ల కచ్చితంగా ప్రభావం ఉంటుంది. కాని ఆర్థిక మాంద్యం ప్రభావంతో పోలిస్తే దాని ప్రభావం కనీస మాత్రంగానే ఉంటుంది' అని సంఘం అధ్యక్షుడు నరసింహ అభిప్రాయం వెలిబుచ్చారు. 'రానున్న రెండేళ్ళలో 30 శాతం వృద్ధిని నాస్ కామ్ ఊహిస్తున్నది' అని నరసింహ చెప్పారు.
News Posted: 6 May, 2009
|