బాబు వరం గోద్రెజ్ కు దెబ్బ!
బెంగళూరు : నారా చంద్రబాబు నాయుడు పుణ్యమా అని గోద్రెజ్ అండ్ బాయిసి మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ విభాగమైన గోద్రెజ్ అప్లయన్సెస్ దేశవ్యాప్తంగా మార్కెట్లలోకి తన ఇయాన్ శ్రేణి ఎల్ సిడి టివిల అమ్మకాన్ని వాయిదా వేసుకోవలసి వచ్చింది.
కారణం? ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగు దేశం పార్టీ (టిడిపి) ఇటీవలి ఎన్నికలలో ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి కలర్ టివిలను ఉచితంగా పంపిణీ చేస్తామని వాగ్దానం చేసింది. ఇది పెద్ద మార్కెట్ అయిన రాష్ట్రంలో టెలివిజన్లకు డిమాండ్ అకస్మాత్తుగా పడిపోవడానికి దారి తీసింది.
గత అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఎల్ సిడి టివిల ప్రయోగాత్మకంగా మార్కెటింగ్ ను ప్రారంభించిన, మరొక వైపు ఆర్థిక మాంద్యంతో సతమతం అవుతున్న ఈ వినిమయ వస్తువుల ఉత్పత్తి సంస్థకు ఇది రెండు విధాలుగా దెబ్బ అయింది. '2009 మొదట్లో మార్కెటింగ్ రెండవ దశను తలపెట్టగా అది ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధి స్తంభించిపోవడం వల్ల అది నిలచిపోయింది. మాంద్యం కారణంగా కూడా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకు దేశవ్యాప్తంగా ఈ టివిల మార్కెటింగ్ ను వాయిదా వేసుకున్నది' అని గోద్రెజ్ అప్లయన్సెస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (అమ్మకాలు, మార్కెటింగ్) కమల్ నంది తెలియజేశారు.
ఒక యూరోపియన్ సంస్థతో కలసి గోద్రెజ్ సంస్థ కలర్ టివిల ఉత్పత్తిని ప్రారంభించింది. ఉత్తరాఖండ్ లోని సంస్థ ఫ్యాక్టరీపై రూ. 150 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇయాన్ శ్రేణి ఎల్ సిడి టివిల స్క్రీన్ సైజులు 15 అంగుళాల నుంచి 42 అంగుళాల వరకు ఉంటాయి. వీటి ధరలు రూ. 6000, రూ. 70 వేల మధ్య ఉంటాయి.
News Posted: 6 May, 2009
|