టాటా బాటలో రియల్టర్లు
హైదరాబాద్ : టాటా గ్రూప్ 'శుభ గృహ' పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని రియల్టర్లు మధ్య తరగతివారికి అనుకూలంగా అపార్ట్ మెంట్ల ధరలను తగ్గించారు. అన్ని మౌలిక సదుపాయాలతో రూ. 10 లక్షలకు రెండు బెడ్ రూమ్ ల ఫ్లాట్ దొరకడమనేది క్రితం సంవత్సరం కలగానే ఉండేది. అయితే, మారిన పరిస్థితులలో ఇది ఇప్పుడు వాస్తవం కాబోతున్నది.
'మేము రూ. 2.92 లక్షల కన్నా తక్కువ ఖరీదుకు ఒక చిన్న ఫ్లాట్ నిర్మించగలం' అని రాష్ట్ర బిల్డర్ల ఫోరమ్ అధ్యక్షుడు సి. శేఖరరెడ్డి చెప్పారు. 'గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల విలీనం చేసిన మునిసిపాలిటీలన్నిటిలో వీటిని నిర్మించడం సాధ్యమే' అని ఆయన తెలిపారు. 225 చదరపు అడుగుల విస్తీర్ణంలో చదరపు అడుగుకు రూ. 1300 ఖర్చుతో పొందికగా ఉండే ఒక రూమ్, కిచెన్ ఉన్న ఫ్లాట్ ను నిర్మించి రూ. 2.25 లక్షలకు విక్రయించవచ్చునని శేఖరరెడ్డి సూచించారు.
అనేక మంది బిల్డర్లు బడ్జెట్ అపార్ట్ మెంట్లపై దృష్టి కేంద్రీకరించసాగారు. ఒక రూమ్, కిచెన్, బాత్ రూమ్ సౌకర్యాలతో నిర్మించే ఫ్లాట్ ఎంతో అనువుగా ఉండగలదు. కస్టమర్లను తిరిగి ఆకర్షించడానికి హైదరాబాద్ లోని అశోకా బిల్డర్స్, అలియన్స్, పిబిఎల్ కన్ స్ట్రక్షన్స్ వంటి భారీ రియల్ ఎస్టేట్ సంస్థలు అదనపు సదుపాయాలతో పథకాలు రూపొందిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలలోను, పరిసర ప్రాంతాలలోను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్లను 20 శాతం నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ తో అమ్మజూపుతున్నారు. పలువురు బిల్డర్లు పిల్లల ఆట స్థలం, కేబుల్ కనెక్షన్, వాటల్ ఫిల్టర్ యూనిట్ మొదలైనవాటిని ఉచితంగా ఇవ్వజూపుతున్నారు.
అశోకా బిల్డర్స్ సంస్థ విషయాన్నే పరిశీలిస్తే, ఈ సంస్థ చదరపు అడుగుకు రూ. 5000 నుంచి రూ. 8000 వరకు ధరతో సంపన్న వర్గాలకు అనువుగా ప్రాజెక్టులు చేపట్టుతుండేది. ఇప్పుడు ఈ సంస్థ చదరపు అడుగుకు రూ. 2500 ధరకు మాదాపూర్ లో 100 ఫ్లాట్లను నిర్మించేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది.
'మధ్య తరగతి వారు బంగారు గనిలా మారారు. అందువల్ల వారి అవసరాలకు అనువైన ధరలలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించుకున్నాం' అని అశోకా డెవలపర్స్ అండ్ బిల్డర్స్ సంస్థ చైర్మన్ కె. లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఈ రంగానికి 3 శాతం వడ్డీ రేటుకు ప్రభుత్వం రుణాలు కల్పించి, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)లో మార్పులు చేస్తే ఈ ధరలను మరింత తగ్గించవచ్చునని శేఖరరెడ్డి సూచించారు.
News Posted: 10 May, 2009
|