ముగింపు లేని మారుతి 800
ముంబై : దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యక్తిగత రవాణా సాధనాలలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన కారు 'మారుతి 800' కొత్త జీవితాన్ని సంతరించుకోవచ్చు. ఈ కారు ఉత్పత్తికి క్రమంగా స్వస్తి చెప్పడానికి మారుతి సుజుకి ఇండియా సంస్థ (ఎంఎస్ఐఎల్) అధికారికంగా విధించిన గడువుకు మించి కారును రోడ్డుపై కొనసాగించడానికి మార్గాన్ని సంస్థ ఇంజనీర్లు కనుగొన్నట్లు కనిపిస్తున్నది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా అమలులోకి రానున్న 'భారత్ స్టేజ్ 4' ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా కారు ఇంజన్ ను సంస్థ ఇంజనీర్లు అప్ గ్రేడ్ చేయవచ్చు. ఖర్చు కారణంగా ఇంజన్ ను అప్ గ్రేడ్ చేసే శక్తి లేనందున ఎం800 కారును 11 నగరాలలో 2010లోగాను, మొత్తం దేశంలో 2015-16లోగాను రంగంలో నుంచి తొలగించనున్నట్లు సూచిస్తూ ఎంఎస్ఐఎల్ ఒక నెల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.
'బిఎస్ 4 నిబంధనలకు అనువైన రీతిలో ఎం800 కారు ఇంజన్ లో కొన్ని మార్పులు తీసుకురాగలం' అని ఎంఎస్ఐఎల్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంజనీరింగ్) ఐ.వి. రావు తెలియజేశారు. అయితే, 'కారును దశల వారీగా ఉపసంహరించడంపై నిర్ణయం పూర్తిగా మా మార్కెటింగ్ బృందంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యం కాదని వారు భావించిన పక్షంలో దీని (ఎం800) ఉత్పత్తిని మేము నిలిపివేయవలసి ఉంటుంది' అని రావు తెలిపారు.
మరొక మారుతి వాహనం 'ఆమ్నీ' ఉత్పత్తిని కూడా దాదాపుగా అదే సమయంలో దశలవారీగా నిలిపివేయనున్నారు. అయితే, బహుళ ఉపయోగ వాహనంగా వర్గీకరించిన ఆమ్నీ కారుకు ఇటీవల అకస్మాత్తుగా డిమాండ్ పెరగడంతో తన నిర్ణయం అమలును సంస్థ వాయిదా వేయవలసి వచ్చింది. ఆమ్నీ, ఎం800 కార్లు రెండూ 796 సిసి, పెట్రోల్ తో పని చేసే, 3 సిలిండర్ ఎంపిఎఫ్ఐ ఇంజన్, సిలిండర్ కు రెండు వాల్వులతో కూడుకున్నవే. అయితే, ఎం800 కారు 37 బిహెచ్ పి వద్ద అదనపు శక్తి కలది. ఆమ్నీ గరిష్ఠ శక్తి 35 బిహెచ్ పి. ఆమ్నీ కారు ఇంజన్ ను కొత్త ఎమిషన్ నిబంధనలకు అనువుగా మారుస్తున్నప్పటికీ కారు ఉత్పత్తిని కొనసాగించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు.
ఎం800 కార్ల అమ్మకాలు ఎక్కువగా గ్రామీణ, ఒక మోస్తరు పట్టణ ప్రాంతాల మార్కెట్లలోను జరుగుతుంటాయి. ఆ ప్రాంతాలలో చాలా కుటుంబాలలో ఈ కారుకే తొలి ప్రాధాన్యం లభిస్తుంటుంది. ప్రతి నెల దాదాపు 2500 నుంచి 3000 వరకు ఎం800 కార్లు, దాదాపు 5000 వరకు ఆమ్నీ కార్లు అమ్ముడుపోతుంటాయి.
News Posted: 11 May, 2009
|