బిల్డర్లకు ఊరట
హైదరాబాద్ : కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు బిల్డర్లు ఆనందాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎన్నికల అంశం కాలేదని, భవన నిర్మాణ పరిశ్రమకు ఇది ఎంతైనా ప్రోత్సాహం ఇవ్వగలదని బిల్డర్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధికారంలోకి వస్తుందేమోనని బిల్డర్లు భయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదనకు టిడిపి మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో పొత్తు కూడూ పెట్టుకోవడం ఇందుకు కారణం.
ఒక సంవత్సరం లోగా కనీసం 20 శాతం లాభాలు రాగలవు కనుక కొనుగోలుదారులు భారీగా పెట్టుబడులు పెట్టగలరని రియల్టీ సంస్థలు ఆశిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ వృద్ధికి ఏ అంశమూ ప్రతిబంధకం కాదు. 'ఈ ఎన్నికల ఫలితాలు పరిశ్రమకు సానుకూల సంకేతాన్ని ఇస్తున్నాయి' అని అలియన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ హరి చల్లా అభిప్రాయం వెలిబుచ్చారు. 'కేంద్రంలోను, రాష్ట్రంలోను సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడడం పరిశ్రమకు ఒక దిశను నిర్దేశిస్తుంది. తెలంగాణ అంశం కారణంగా కొందరు ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షించారు. హైదరాబాద్ లోను, ఇతర నగరాలలోను ఈ పరిశ్రమ వృద్ధికి ఇప్పుడు ఏ అడ్డూ లేదు' అని హరి పేర్కొన్నారు.
'రాష్ట్రమంతటా ఈ పరిశ్రమలో ఉధృతంగా కార్యకలాపాలు సాగగలవు' అని మరొక బిల్డర్ సూచించారు. 'పరిశ్రమ సమస్యలపై దృష్టి సారించవలసిందిగా మేము కొత్త ప్రభుత్వాలను కోరగలం' అని ఆయన తెలిపారు. కాగా, భవిష్యత్తులో ధరలు పెరగవచ్చు కనుక పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన తరుణమని ఫస్ట్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ చైర్మన్ ఎస్. రామిరెడ్డి, ఎస్ఎపి కన్ స్ట్రక్షన్స్ సంస్థ సిఇఒ రాజశేఖర్ అభిప్రాయం వెలిబుచ్చారు. 'ప్రస్తుతం స్థలాలు, ఇళ్ళు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి' అని రామిరెడ్డి చెప్పారు.
News Posted: 17 May, 2009
|