నానోకు పోటీగా ఆల్టో!
ముంబాయి : టాటా కార్ల సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తున్న లక్ష రూపాయల కారుకు పోటీగా తాను ఆల్టో కొత్త మోడల్ ను ప్రవేశపెట్టాలని మారుతీ సుజికీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత దేశంలో అతి పెద్ద కార్ల సంస్థ మారుతీ సుజికీ నుంచి ఉత్పత్తి అవుతున్న ఆల్టో మోడల్ కు మార్కెట్ లో విపరీతమైన స్పందన ఉన్న విషయం తెలిసిందే. అయితే, సామాన్య వినియోగదారులకు మరింతగా చేరువ అవ్వాలన్న టాటా సంస్థ మాదిరిగానే మారుతీ సుజికీ కూడా ఆలోచన చేసింది. దీనితో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్టో మోడల్ లోని కొన్ని సౌకర్యాలను తగ్గించి తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది.
పాత మోడల్స్ కు కొత్త రూపం కల్పించి మార్కెట్లో తమకు సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటామని మారుతీ సుజికీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నకనాషి ఈ మధ్యనే పేర్కొనడం గమనార్హం. పాతబడిపోతున్న వేగనార్, వెర్సా లాంటి మోడళ్ళను కూడా ఆధునికీకరించాలని మారుతీ సుజికీ నిర్ణయించిందన్నారు. గడచిన మూడేళ్ళలో భారతదేశంలో మొత్తం ఎనిమిది కొత్త కార్లను ప్రవేశపెట్టినట్లు మారుతీ సుజికీ ఎం.డి. తెలిపారు. అలాగే హ్యూండయ్ శాంత్రో, జిఎం స్పార్క్ కార్లకు దీటుగా కొత్త కెబి సీరీస్ ఇంజన్ తో ఒక్ అప్ మార్కెట్ ఆల్టో మోడల్ కూడా ఉత్పత్తి చేయాలని తాము ఆలోచిస్తున్నామన్నారు.
News Posted: 27 May, 2009
|