సత్యం సిబ్బందికి ప్యాకేజ్
హైదరాబాద్ : ఆదాయం సమకూర్చే స్థానాల్లో లేని సిబ్బందిని తొలగించేందుకు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ సంస్థ ఓ ప్యాకేజ్ ను తయారు చేసింది. సత్యం సంస్థ కొత్త యాజమాన్యం టెక్ మహీంద్రా బెంచ్ మీద ఉన్న వారి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు వారు ప్రస్తుతం తీసుకుంటున్న జీతంలో 40 శాతాన్ని ఆరు నెలల పాటు చెల్లిస్తుంది. ఆరు నెలల అనంతరం వారికి అదే సంస్థలో అవకాశాలు వస్తే విధుల్లోకి తీసుకుంటారు. లేకపోతే అటు నుంచి అటే వారు ఇళ్ళకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 10 వేల మంది సత్యం ఉద్యోగులపై వేటు పడనున్నది. ఒక్కసారిగా వీరందరిపై వేటు వేయడం కన్నా ఆరు నెలల పాటు సమయం ఇచ్చి ప్యాకేజ్ అమలుకు ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం.
ఈ ప్యాకేజ్ పరిధిలోకి వచ్చే వారికి ఈ ఆరు నెలల పాటూ మెడికల్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలు కూడా పొందుతారు. ఉద్యోగాలు పోయిన వారికి వేరే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సంస్థ కొన్ని ఔట్ ప్లేస్ మెంట్ సంస్థలతో చర్చిస్తున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రాజెక్టులు లేకుండా బెంచ్ మీద ఉన్న వారితో పాటు మార్కెటింగ్ సిబ్బందిపైన కూడా ఈ వేటు పడనున్నది. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లో అధిక రాబడులు ఉన్నాయని ప్రపంచాన్ని నమ్మించేందుకు ఆ సంస్థ మాజీ చైర్మన్, వ్యవస్థాపకడు రామలింగరాజు అవసరానికి మింది సిబ్బందిని తీసుకున్నారని, ప్రస్తుతం అలాంటి వారినే తొలగించేందుకు టెక్ మహీంద్రా ప్యాకేజ్ సిద్ధం చేసిందంటున్నారు. ప్రస్తుతం సత్యం సంస్థలో 42 వేల మంది ఉద్యోగులుండగా పదివేల మందిని ప్యాకేజ్ పేరుతో తొలగిస్తే 32 వేల మంది మిగులుతారు. ఉద్యోగుల తొలగింపు కత్తి ప్రారంభ, మధ్య స్థాయిలో ఉన్న వారిపైనే వేలాడుతున్నట్లు తెలుస్తోంది.
News Posted: 30 May, 2009
|