రుణాల రేట్లు తగ్గవు
ముంబై : రుణాలపై వడ్డీ రేట్లలో భారీ స్థాయిలో తగ్గుదల ఏదీ ఉండకపోవచ్చునని కార్పొరేట్ సంస్థలకు ప్రధాన బ్యాంకులు స్పష్టం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుండగా కార్పొరేట్ సంస్థలు కోరుతున్న స్థాయిలో ఈ రేట్లను తగ్గించజాలమని ప్రధాన పారిశ్రామిక సంస్థల సమాఖ్యలకు బ్యాంకులు తెలియజేశాయి. బ్యాంకు యాజమాన్యాల సంఘం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) క్రితం వారం ఒక సమావేశంలో భారతీయ పరిశ్రమల బృహత్ సమాఖ్య (సిఐఐ)కి, భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఎఫ్ఐసిసిఐ)కి తన అభిప్రాయాలను నివేదించింది.
'మధ్యకాలిక రుణాల వరకు ప్రస్తుత స్థాయి నుంచి 50 నుంచి 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) వరకు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చునని కార్పొరేట్లతో మేము చెప్పాం' అని ఈ సమావేశానికి హాజరైన ఒక బ్యాంకు సిఇఒ తెలియజేశారు. సమీప భవిష్యత్తులో రుణాలపై వడ్డీ రేట్లను 400 నుంచి 500 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాలని కార్పొరేట్లు కోరాయి. 'ప్రైమ్ లెండింగ్ రేట్ (పిఎల్ఆర్)లకు దిగువ స్థాయిలో రేట్లకు చాలా వరకు రుణాలు ఇచ్చిన విషయాన్ని వాటికి మేము గుర్తు చేశాం' అని ఆయన తెలిపారు. చాలా ప్రభుత్వ రంగ (పిఎస్ యు) బ్యాంకులు కొలబద్ద రేట్లుగా ఉపయోగపడే తమ పిఎల్ఆర్ లను 12 శాతం, 12.5 శాతం మధ్య స్థాయికి నిర్థారించాయి. కాని ప్రైవేట్ బ్యాంకుల పిఎల్ఆర్ లు 14 శాతం నుంచి 16 శాతం వరకు ఉంటున్నాయి.
ఉత్పత్తి రంగానికి రుణ సహాయాన్ని వేగిరపరచడానికి పారిశ్రామిక సంస్థల సమాఖ్యలు, బ్యాంకులు ఎప్పటికప్పుడు సమావేశం అవుతుండాలన్న ప్రభుత్వ ఆదేశాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం జరిపిన తరువాత పరిశ్రమల సంఘాలు, బ్యాంకులు తిరిగి సమావేశం అవుతాయి. బ్యాంకుల పని తీరు సమీక్షకై ఆర్థిక మంత్రి ఈ నెల 10న బ్యాంకు సిఇఒలతో సమావేశం అవుతారు. రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించవలసిందని తమను మంత్రి కోరవచ్చునని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏప్రిల్ మొదటి వారంలో తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. బ్యాంకులు ఈ రేట్లను 2009 జూన్ మధ్యభాగంలో 50 బిపిఎస్ మేరకు తగ్గించవచ్చునని భావిస్తున్నారు.
News Posted: 2 June, 2009
|