యాడ్ లాబ్స్ గాయబ్
ముంబై : అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూపులోని 800 కోట్ల రూపాయల విలువైన యాడ్ లాబ్స్ ఫిల్మ్స్ లిమిటెడ్ ను పూర్తిగా రేడియో బిజినెస్ కు మాత్రమే పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది. బిగ్ ఎఫ్ఎం పేరిట ఎఫ్ఎం రేడియో సెంటర్లను నిర్వహిస్తున్న అంబానీ గ్రూపు ఈ రెండు సంస్థలనూ కలిపి రిలయన్స్ యునికామ్ (ఆర్ యుఎల్) పేరిట కొత్త సంస్థను ప్రారంభించనుందని, యాడ్ లాబ్స్ అన్ని సినిమా నిర్మాణాలనూ ఆపివేయనున్నదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. యాడ్ లాబ్స్ ను మరింత లాభదాయకంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. ఈ విషయంపై స్పందించేందుకు అటు బిగ్ఎఫ్ఎం, ఇటు యాడ్ లాబ్స్ ప్రతినిధులు అందుబాటులో లేరు. ఇందుకు సంబంధించి ప్రమోటర్ల వాటాలను బదిలీ చేసుకునేందుకు, ఎఫ్ఎం రేడియో లైసెన్సులను ఆర్ యుఎల్ కు మార్చేందుకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఆ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను పొందామని మాత్రం బిగ్ ఎఫ్ఎం వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 44 నగరాలు, పట్టణాల్లో బిగ్ 92.7 ఎఫ్ఎం పేరిట రేడియో స్టేషన్ లను నిర్వహిస్తోంది. ఆర్ యుఎల్ ఏర్పడితే భవిష్యత్ లో మంచి లాభాలను ఆర్జించే సంస్థగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఎస్.బి.ఐ కాపిటల్ సెక్యూరిటీస్ రీసెర్చె విశ్లేషకుడు ఆశిష్ తివారి వ్యాఖ్యానించారు. కొత్త సంస్థపై రేడియో బిజినెస్ ద్వారా ప్రస్తుతమున్న 16 కోట్ల రూపాయల నిర్వహణా నష్టాలు పెద్దగా ప్రభావం చూపిస్తాయని భావించలేమని ఆయన అన్నారు.
కాగా, 2009 ఆర్థిక సంవత్సరంలో యాడ్ లాబ్స్ లో రేడియో బిజినెస్ ద్వారా 141.61 కోట్ల రూపాయల (మొత్తం ఆదాయంలో 20 శాతం) ఆదాయం లభించింది. ప్రస్తుతం యాడ్ లాబ్స్ ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ ను పెంచుకునే దిశగా ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 473 స్క్రీన్ లను నిర్వహిస్తున్న సంస్థ 2011 చివరికి మరో 123 స్క్రీన్ లు భారత్ లో, విదేశాల్లో 49 స్క్రీన్ లను ప్రారంభించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మల్జీప్లెక్స్ థియేటర్లలో 70 శాతం మాత్రమే వసూళ్ళు వస్తుండడం, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత స్థితి, సినీ నిర్మాతలతో సంబంధాలు చెడిపోవడం తదితర కారణాలతో యాడ్ లాబ్స్ లాభాలు గణనీయంగా తగ్గాయి.
News Posted: 4 June, 2009
|