జోరుగా కార్ల అమ్మకాలు
న్యూఢిల్లీ : దేశంలో కారు, దిచక్ర వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. వరుసగా నాలుగవ నెలలో స్వదేశీ కారు అమ్మకాల్లో వృద్ధిని సాధించింది. మే నెలలో 2.48 శాతం విక్రయాలు పెరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి ఆటో రంగానికి సహకారం అంతగా కనిపించడం లేదు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్‌ఐఎఎమ్) ప్రకారం, మే నెలలో స్వదేశీ కారు అమ్మకాలు 1,10,745 యూనిట్ల నుంచి 1,13,490 యూనిట్లకు పెరిగాయి. మే నెలలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు కూడా 7,27,937 యూనిట్లతో 12.45 శాతం వృద్ధిని సాధించాయి. గత ఏడాది ఇదే సమయానికి ద్విచక్ర వాహన విక్రయాలు 6,47,358 యూనిట్లు నమోదయ్యాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు గత ఏడాది ఇదే సమయానికి 5,13,209 యూనిట్ల నుంచి 5,76,541 యూనిట్లతో 12.34 శాతం వృద్ధిని సాధించాయి.
వృద్ధి బాటన నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం సహకారం లేకపోవడం ఆటో పరిశ్రమలను నిరాశపరుస్తుందని ఎస్‌ఐఎఎమ్ తెలిపింది. గత మూడు, నాలుగు నెలల్లో వృద్ధిని పరిశీలించిన చూసినట్లయితే, ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరిన్ని ఉద్దీపన ప్యాకేజీల అవసరం ఎంతైనా ఉందని ఎస్‌ఐఎఎమ్ సీనియర్ డైరెక్టర్ సుగాటో సేన్ తెలిపారు. జూన్ నెలలో చూసినట్లయితే ప్రయాణికుల వాహనాల పరిస్థితి అధ్వాన్నంగానే కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ ఏడాది మే నెలలో మొత్తం మొత్తం వాహన విక్రయాలు 8,53, 969 యూనిట్ల నుంచి రూ.9,29,596 యూనిట్లకు పెరిగి 8.86 శాతం వృద్ధిని సాధించాయని ఎస్‌ఐఎఎమ్ వెల్లడించింది.
మారుతీ సుజుకీ 57,315 యూనిట్ల నుంచి 62,878 యూనిట్లతో 9.71 శాతం వృద్ధిని సాధించింది. అలాగే ఇతర కంపెనీలను చూసినట్లయితే, హ్యుందాయ్ మోటార్ 24,506 యూనిట్ల నుంచి 23,501 యూనిట్లతో 4.10 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ విక్రయాలు 14,228 యూనిట్ల నుంచి 12,838 యూనిట్లతో 9.77 శాతం తగ్గాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే అమెరికాలో జనరల్ మోటార్స్ దివాళాను ప్రకటించినప్పటికీ మే నెలల్లో విక్రయాలు 3,847 యూనిట్ల నుంచి 3,890 యూనిట్లతో 1.18 శాతం వృద్ధిని సాధించాయి. మే నెలలో కారు ఎగుమతులు 42 శాతం వృద్ధిని సాధించాయి. స్వదేశీ విక్రయాలను చూసినట్లయితే 2.48 శాతం వృద్ధి నమోదు చేశాయి.
News Posted: 8 June, 2009
|