చమురు ధరకు మళ్ళీ రెక్కలు
ముంబాయి : ముడి చమురు ధర బ్యారెల్ కు గురువారంనాడు అంతర్జాతీయ మార్కెట్ లో 72 డాలర్లకు చేరింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి గరిష్టంగా 2.12 శాతం పెరిగింది. దీనితో క్రూడాయిల్ ధరలు మళ్ళీ పరుగులు తీస్తున్నాయి. ఆర్థిక మాంద్యం అదుపులోకి రాకపోయినప్పటికీ చమురు ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతుండడంతో వినియోగదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. పెరిగిన ధరల ప్రకారం క్రూడాయిల్ భారతదేశ మార్కెట్ లోకి రాకముందే బ్యారల్ ధర 3,368 రూపాయల వద్ద క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. చమురు ఉత్పత్తిని పెంచేది లేదని ఒపెక్ దేశాలు భీష్మించుకు కూర్చోవడంతో పాటు డిమాండ్ పెరుగుదలకు కారణమయ్యాయి. దీనితో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని గడగడలాడించిన సమయంలో చమురుకు డిమాండ్ లేకపోవడం, ఉత్పత్తిని తగ్గించినా ఆయా దేశాలలోని ప్రధాన సంస్థలు బ్లాక్ మార్కెట్ వ్యవహారం కొనసాగించడంతో ధరలు ఇంతకాలంగా అదుపులో ఉన్నాయి. అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మార్కెట్ పరిణామాలు అనూహ్యంగా ఆశావహంగా మారడంతో చమురు వినియోగానికి మళ్ళీ డిమాండ్ వచ్చింది. దీనితో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సతమతం అవుతున్న తమపై ఆయిల్ ధరల పెరగుదలతో మరింత భారంగా పరిణమించనున్నదని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 11 June, 2009
|