రాజీకి అంబానీలపై ఒత్తిడి
ముంబై : కృష్ణా గోదావరి (కెజి) బేసిన్ సహజ వాయువుపై బొంబాయి హైకోర్టు ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును దశాబ్దం నాటి తీవ్ర వ్యాపార వివాదం పరిష్కారానికి లభించిన అవకాశంగా అంబానీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ (ఆర్ఎన్ఆర్ఎల్)తో వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవలసిందిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) యాజమాన్యంపై వారు ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే, అనిల్ అంబానీ గ్రూప్ మాత్రం కోర్టు తీర్పును అమలు జరపడం ముందు అవసరమని గట్టిగా వాదిస్తున్నది. గురువారం ఉదయం గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరాతో సమావేశమయ్యారు. సాయంత్రం అనిల్ పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు.ఈ వివాదం పరిష్కారంలో ప్రభుత్వం పాత్రకు ఎంత ప్రాముఖ్యం ఉన్నదో ఇది సూచిస్తున్నది.
మీడియా ప్రతినిధులు తనను కలుసుకున్నప్పుడు ఈ సమావేశం గురించి చర్చించేందుకు నిరాకరించిన మురళీ దేవరా ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోగలమని తెలియజేశారు. కాగా, హైకోర్టు తీర్పు దరిమిలా తాము ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీతో మాట్లాడతామని, అనిల్ తో గ్యాస్ వివాదాన్ని పరిష్కరించుకోవలసిందిగా కోరగలమని ఆర్ఐఎల్ బోర్డు సభ్యులు ఇద్దరు తెలియజేశారు. 'చేతులు కలపవలసిందిగా ఆయన (ముఖేష్ అంబానీ)కి నేను సలహా ఇస్తాను. ఎందుకంటే సుదీర్ఘ న్యాయ పోరాటం వల్ల ఖర్చులు బాగా ఎక్కువగా ఉండడమే కాకుండా అప్పులు కూడా అత్యధికంగా ఉన్నాయి' అని ఒక డైరెక్టర్ చెప్పారు. 'హైకోర్టు తీర్పు పర్యవసానాలపై చర్చించేందుకు కంపెనీ బోర్డు సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము కోరతాం' అని మరొక ఆర్ఐఎల్ బోర్డు 'ఇటి నౌ' విలేఖరితో చెప్పారు. ఆ ఇద్దరూ తమ పేర్లు వెల్లడి చేయరాదనే షరతుపైనే మాట్లాడారు.
యూనిట్ కు ప్రభుత్వం నిర్ణయించిన 4.20 డాలర్ల ధరకు కాకుండా 2.34 డాలర్లకు గ్యాస్ ను ఆర్ఎన్ఆర్ఎల్ కు విక్రయించాలని ఆర్ఐఎల్ ను హైకోర్టు ఆదేశించింది. 2005లో సోదరులు విడిపోయిన వెంటనే కుటుంబం ఎంఒయును ఆమోదించిన ఆర్ఐఎల్ బోర్డు సమావేశాల గురించి బొంబాయి హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించినందున పూర్తి బోర్డు సమావేశంలో హైకోర్టు తీర్పుపై చర్చించవలసి ఉంటుందని ఆర్ఐఎల్ డైరెక్టర్ సూచించారు. దేశంలో అత్యంత పెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ కు చెందిన కార్పొరేట్ పాలన బృందం దీని వల్ల వాటాదారులపై పడే ప్రభావాన్ని అవగాహన చేసుకునేందుకు తీర్పును పరిశీలించగలదని ఆయన తెలిపారు.
ఈ విషయమై ఇటి నౌ విలేఖరి సంప్రదించినప్పుడు ఆర్ఎన్ఆర్ఎల్ తో సంప్రదింపులు జరపవలసిందిగా తమ సంస్థపై ఒత్తిడి ఏమీ రావడం లేదని ఆర్ఐఎల్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. 'తీర్పు వల్ల కలిగే ప్రభావంపై మేము పరిశీలన జరుపుతున్నాం. మా భవిష్య కార్యాచరణ కోసం మేము న్యాయవాదుల సలహా కోసం నిరీక్షిస్తాం' అని ఆయన తెలిపారు. కాగా, కోర్టు వెలుపల పరిష్కారానికి తమ గ్రూపు అంగీకరించే అవకాశం లేదని ఆర్-అడాగ్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
News Posted: 19 June, 2009
|