`మహీంద్రా సత్యం'
దరాబాద్ : సత్యం కంప్యూటర్స్ బ్రాండ్ నేమ్ ను `మహీంద్రా సత్యం'గా మారుస్తున్నట్టు మహీంద్రా గ్రూప్ సంస్థల వైఎస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలియజేశారు. హైదారాబాద్ లోని సత్యం ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్త పేరును ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ప్రసంగిస్తూ, మహీంద్రా గ్రూప్ లోగోనే `మహీంద్రా సత్యం'కు వాడనున్నామని, కొత్త లోగో మహీంద్రా గ్రూప్ తో పాటు సత్యంను ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం తాము కస్టమర్లకు నాణ్యతతో కూడిన సేవలు, కార్పొరేట్ గవర్నెన్స్ లో పైస్టాండర్డ్స్ కొనసాగించడం లక్ష్యాలుగా పనిచేస్తున్నామని తెలిపారు. సంస్థపై పడ్డ మచ్చను పూర్తిగా తుడిచేందుకే బ్రాండ్ పేరును మార్చాలని భావించామన్నారు. సత్యం కంప్యూటర్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు కలకాలం నిలిచి ఉండాలని తాము అభిలషించామని, అందువల్లే కొత్త బ్రాండ్ పేరును మహీంద్రా సత్యంగా నిర్ణయించామని ఆయన తెలిపారు.
సంస్థ పురోగమన బాటలో ఇది తొలి అడుగని సత్యం బోర్డు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నాయర్ వ్యాఖ్యానించారు. కొత్త బ్రాండ్ పేరును షేర్ హోల్డర్లూ, కస్టమర్లూ స్వాగతించగలరని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. పనితీరుతోపాటు కస్టమర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని, సంస్థలోని ఉద్యోగులందరూ నైపుణ్యమున్నవారేనని వివరించారు. నాలుగ్గోడల మధ్య ఆదివారం జరిగిన ఈసమావేశంలో ఆనంద్ మహీంద్రాతో పాటు గ్రూపు సంస్థల హెచ్ ఆర్ హెడ్ రాజీవ్ దూబే, సిపి గుర్నానీ, రాజీవ్ కాల్రాలతోపాటు సత్యం, టెక్ మహీంద్రాలకు చెందిన సీనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు.
News Posted: 22 June, 2009
|