ఫ్యాబ్ సిటీలో ఆదిత్య గ్లోబల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో 1200 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫ్యాబ్ సిటీలో ఆదిత్య గ్లోబల్ సంస్థకు ఆరు ఎకరాలు కేటాయించింది. ఈమేరకు ఫ్యాబ్ సిటీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఎపిఐఐసి సిఎమ్‌డి బిపి ఆచార్య తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో ఆదిత్య గ్లోబల్ సాలార్ ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తుందని, దీనికోసం సదరు సంస్థ రూ. 60 కోట్లు వ్యయం చేయనున్నదని ఆయన చెప్పారు. మరో ఎనిమిది నెలల్లో నిర్మాణ పనులను ఆదిత్య గ్లోబల్ చేపడుతుందని వివరించారు. అదే విధంగా ఫ్యాబ్ సిటీలో సెమీ కండక్టర్ల ఉత్పాదన కోసం సెమ్ ఇండియా సంస్థకు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
ఫ్యాబ్ సిటీ నెలకొల్పిన తర్వాత సెమ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించింది. అయితే అనేక గడువులు తీసుకున్నప్పటికీ సెమ్ ఇండియా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడంలో విఫలమైంది. దీంతో సెమ్ ఇండియాకు కేటాయించిన 100 ఎకరాల భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరించాలంటూ ఎపిఐఐసి ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి సెమ్ ఇండియా సంస్థ సంజాయిషీ ఇస్తూ, ఆర్థిక మాంధ్యం కారణంగా పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడంతో ఫ్యాక్టరీ స్థాపన అనుకున్న విధంగా ముందుకు సాగలేదని, ఈ నేపధ్యంలో తమ వద్ద ఉన్న నిధులతో చిన్నపాటి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టదలచామని, అందుకు 25 ఎకరాల భూమి సరిపోతుందని పేర్కొంది. దీంతో సెమ్ ఇండియా నుంచి మిగిలిన 75 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఎపిఐఐసి నిర్ణయించినట్లు ఆచార్య తెలిపారు.
News Posted: 30 June, 2009
|