`రిలయన్స్ రాయల్టీ చెల్లించాలి'
న్యూఢిల్లీ : కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్ లో ఉత్పత్తి చేసే సహజవాయువు కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలని పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం(పిఎస్ సి) లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాయల్టీని చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా జితిన్ లిఖితపూర్వకంగా వివరాలను అందజేశారు. డి6 బ్లాక్ నుంచి ఉత్పత్తి అయ్యే ఆయిల్, గ్యాస్ లో ప్రభుత్వానికి రావల్సిన వాటా, రాయల్టీలను నిర్ణయించడానికి నిబంధనావళిగా పిఎస్ సి ఉందని పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం నిర్ణయించిన అమ్మకపు ధర ప్రకారం రాయల్టీ, లాభాల వాటా చెల్లించడానికి పిఎస్ సి లో అవకాశం ఉందో లేదో జితిన్ వివరించలేదు. డి6 బ్లాకులో ఉత్పత్తి అయ్యే ఆయిల్, గ్యాస్ క్షేత్రాల్లోని వనరుల యజమాన్యపు హక్కులతో ప్రభుత్వం లాభాల వాటాదారుగా ఉంది. కాగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాసుకు ప్రభుత్వం ధరను నిర్ణయించింది. ఒక మిలియన్ బ్రిటీష్ థెర్మల్ యూనిట్ ధరను 4.20 డాలర్లుగా నిర్ణయించింది. అయితే అనిల్ అంబానీ గ్రూపు సంస్థలకు యూనిట్ గ్యాస్ ను 2.34 డాలర్లకే సరఫరా చేయాలని ముంబయి హైకోర్టు గత నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా హైకోర్టు సూచించిన ధర 44 శాతం తక్కువ.
ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే రాయల్టీ చెల్లించాలని రిల్ ను కోరుతారా లేదా అన్నది జితిన్ స్పష్టం చేయలేదు. రోజుకు ఉత్పత్తి అయ్యే మొత్తం గ్యాసులో సగం అంటే దాదాపు 80 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాసును రిల్ తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. అయితే రిల్ కు అనిల్ అంబానీ గ్రూపునకు కోర్టులో ఉన్న కేసులు ఆ రెండు కంపెనీల వాణిజ్యపరమైన వ్యవహరమని జితిన్ చెప్పారు.ఏమైనా ఒప్పందం(పిఎస్ సి) ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించవలసిందేనని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 2 July, 2009
|