ఎయిరిండియాలో ఇన్ఫీ మూర్తి
న్యూఢిల్లీ : గత వైభవాన్ని తిరిగి పొందటానికి ఎయిర్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించింది. ఏడుగురు సభ్యులతో అంతర్జాతీయ సలహా మండలిని నియమించడానికి ప్రక్రియను ప్రారంభించింది. అంతర్జాతీయ విమానయాన రంగంలో పేరొందిన నిపుణులను ఈ మండలిలో సభ్యులుగా తీసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సలహ మండలికి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నాయకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అలానే లుఫ్తాన్సా, సింగపూర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతులు సభ్యులుగా ఉండవచ్చు. సభ్యుల పేర్లను ఖరారు చేసేందుకు జరుగుతున్న చర్చలు అంతిమదశలో ఉన్నాయని ఎయిర్ లైన్స్ వర్గాలు వివరించాయి. కొత్తగా సృష్టించిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉద్యోగ భర్తీ కోసం త్వరలోనే ప్రకటన వెలువడనుంది. ఎయిర్ ఇండియా కార్యకలాపాలను మెరుగుపరచడానకి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ జాదవ్ నేతృత్వంలో ఒక ప్రొఫెషనల్ ఎయిర్ లైన్స్ మేనేజర్ పనిచేయటానికి వెసులు బాటు కలుగుతుంది.
ఈ సంస్థకు స్వతంత్ర డైరెక్టర్లుగా జాతీయ విజ్ఞాన కమిషన్ చైర్మన్ శామ్ పిట్రోడా, ఇన్ఫోసిస్ మెంటార్, చైర్మన్ ఎన్ ఆర్ నారాయణమూర్తి, టిసిఎస్ సిఎండి ఎస్ రామదోరై లను నియమించడానికి పరిశీలనలో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఆర్ధిక పునర్ నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో అధికారులు తలమునకలై ఉన్నారు. దీనిని కొద్ది వారాలలో ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 2008-09 ఆర్ధిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాలను చవిచూసింది. ఎయిర్ ఇండియా సమర్పించే నివేదికను కేబినెట్ కార్యదర్శి కెఎం చంద్రశేఖర్ నాయకత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. అలానే ప్రతీ నెలా సంస్థ ఖర్చులు తగ్గించుకునే చర్యలను, ఆదాయం పెంచుకునేందుకు చేపట్టే చర్యలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
News Posted: 9 July, 2009
|