రోడ్డుపైకి నానో కారు
ముంబై: రతన్ టాటా కలల వాహనం లక్ష రూపాయల 'నానో' కారు శుక్రవారం నుంచి భారతీయ రోడ్లపై పరుగులెట్టబోతోంది. ఏడాదిన్నర క్రితం ఢిల్లీ ఆటో ఎక్స్ పో లో నానో కారును ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రతన్ టాటా శుక్రవారం నానో కారు తాళాలను తొలి కస్టమర్ కు అందచేయనున్నారు. ముంబై ప్రభాదేవిలోని టాటా షోరూమ్ లో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ ఏడాది మార్చిలో నానో బుకింగ్స్ ప్రారంభించారు. బుకింగ్ చేసుకున్న వారిలో తొలి విడత డెలివరీ అందుకునే లక్ష మందిని కంప్యూటర్ పద్దతి ద్వారా ఎంపిక చేశారు.
వాస్తవానికి వీరందరికీ వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ కల్లా డెలివరీ చేయాల్సి ఉంది. అయితే నానో ఉత్పత్తిలో ఎదురైన కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ లక్ష మందికి కార్ల డెలివరీ వచ్చే ఏడాది జనవరికి గాని పూర్తయ్యేలే కనిపించడంలేదు. ఈ గడువుకు ముందే మొదటి విడత డెలివరీలను పూర్తి చేయగలమని కంపెనీ అధికారులు చెబుతున్నారు.
నానో దేశంలోని రెండు చోట్ల నుంచి ఉత్పత్తి అవుతోంది. గుజరాత్ లోని సనంద్, ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ లలో నానో కార్ల ఉత్పాదన జరుగుతుంది. గుజరాత్ లో నిర్మిస్తున్న ప్లాంట్ అతి పెద్దది. ఈ ప్లాంట్ నిర్మాణం చురుగ్గా సాగుతూనే ఉంది. ఈలోగా పంత్ నగర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి జరిగే నానోలను మార్కెట్లోకి విడుదల చేస్తారు. సనంద్ ప్లాంట్ వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
News Posted: 16 July, 2009
|