నకిలీ నోట్లే దేవుడికి కానుక
శ్రీకాళహస్తి : కోరికలు తీరితే స్వామివారికి తలనీలాలతోపాటు విలువైన వస్తువులు కానుకలుగా హుండీలో వేయడం ఆచారం. లేదంటే నిలువుదోపిడీ ఇస్తామని ఆయా దేవతలను శరణు వేడటం జరుగుతుంది. కానీ ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో స్వామివారికి నకిలీ నోట్లను ఒక భక్తుడు కానుకగా వేశాడు! శుక్రవారం హుండీ కానుకలను అధికారులు లెక్కించేటప్పుడు కొన్ని కరెన్సీ నోట్లు అనుమానంగా కన్పించడంతో - నోట్ల తనిఖీ నిపుణులను పిలిపించారు. ఈ తనిఖీలలో మొత్తం 10 వేల రూపాయల నకిలీ నోట్లను గుర్తించారు. ఈ సంఘటనపై విచారణకు పాలకమండలి ఆదేశించింది.
రాష్ట్రంలో 75 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో ఈ ఆలయం తృతీయ స్థానంలో ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు తాము ప్రారంభించే వ్యాపారాల్లో, కార్యక్రమాలకు స్వామి వారి ఆశీర్వాదం కోరుతూ కొంత మొత్తాన్ని కానుకగా శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ. కొత్తగా నకిలీ నోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టిన వ్యక్తెవరో ఈ నకిలీ 'కానుక'ను శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించారని కొందరు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం, తిరుమల, కాళహస్తి ఆలయాల్లో కొంతమంది భక్తులు నకిలీ నోట్లను హుండీల్లో వేయడం మామూలే.
News Posted: 22 August, 2009
|