ఇతర ఏటీఎంల్లో ఐదుసార్లే ఫ్రీ
హైదరాబాద్ : ఏటీఎమ్ వినియోగదారులు ఇకపై ఏ బ్యాంక్ ఏటీఎమ్ లోనైనా నగదు తీసుకునే సదుపాయాన్ని నెలకు ఐదుసార్లు మాత్రమే వినియోగించుకోవాలి. ఈ మేరకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చింది. ఏ బ్యాంక్ ఏటీఎం లోనైనా నగదు విత్ డ్రా చేసే సౌకర్యాన్ని ఉచితంగా ఐదు నెలల క్రితం ఆర్ బీఐ అనుమతించింది. అప్పటి వరకూ వేరే బ్యాంక్ ఏటీఎమ్ లలో కార్డుని వాడితే రుసుము చెల్లించాల్సి ఉండేది. రుసుము లేకుండా నగదు విత్ డ్రా చేసేందుకు ఆర్ బీ ఐ అనుమతించడంతో ఏటీఎమ్ లావాదేవీలు పెరిగాయి. దీంతో తమకు నిర్వహణావ్యయం బాగా పెరిగిందని బ్యాంకులు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో లావాదేవీలను అధ్యయనం చేసిన ఐబీఎమ్ ఇతర ఏటీఎమ్ లలో నగదు విత్ డ్రా చేయడం నెలకు ఐదు సార్లు మాత్రమే ఉచితంగా అనుమతించాలని సూచించింది. అంతకు మించిన ప్రతి లావాదేవీకి 20 రూపాయల రుసుము వసూలు చేయాలని తెలిపింది. అదే విధంగా కనిష్టంగా వెయ్యి రూపాయలు, గరిష్టంగా పదివేల రూపాయల వరకే విత్ డ్రాకు అనుమతించాలని చెప్పింది. ఈ సూచనలను పరిశీలించిన ఆర్ బీ ఐ కనిష్టంగా వెయ్యి రూపాయలు విత్ డ్రా చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. మిగిలిన రెండు సూచనలను ఆమోదించింది. దీంతో నెలకు ఐదుసార్లకు మించి ఇతర ఏటీఎమ్ లలో నగదు డ్రా చేస్తే ఖాతాదారుని జేబుకు 20 రూపాయల వంతున చిల్లు పడుతుంది.
News Posted: 22 August, 2009
|