3జి నెత్తిన 4జి పిడుగు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి 35 వేల కోట్ల రూపాయల ధన వర్షం కురిపిస్తుందని మురిపించిన 3జి టెక్నాలజీ అప్పుడే మరుగున పడేటట్లే కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లలో 3జి సౌకర్యం కల్పించేందుకు వీలుగా రేడియో ఫ్రీక్వెన్సీలను అమ్మాలకున్న కేంద్రం ఆశలు ఆడియాసలు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. గత మూడేళ్ళుగా 3జి ని పట్టుకుని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ వేలాడుతోంది. ఈ వ్యవహారంలో మంత్రి రాజా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు సైతం వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాత్రికి రాత్రే మార్పులు వచ్చే ఈ కాలంలో 3జీ మీద మీనమేషాలు లెక్కిస్తుంటే ఆమెరికాకు చెందిన మోటారోలా కంపెనీ తన ఆధునాతన తర్వాతి తరం స్థాయి 4జి టెక్నాలజీని ప్రయోగాత్మక సర్వీసులను భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు ముందుకు వచ్చింది. లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్(ఎల్ టి ఇ) పేరుతో వచ్చే ఈ 4జి టెక్నాలజీతో మొబైల్ ఫోన్ లోకి సెకనకు 70 మెగాబైట్ల సమాచారన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరాంతానికి మోటారోలా ఈ టెక్నాలజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తోంది.
ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకవచ్చేందుకు వీలుగా ట్రయల్ స్పెక్ట్రమ్ ను కేటాయించవలసిందిగా తమ కంపెనీ కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖను కోరే అవకాశం ఉందని మోటారోలా ఇండియా నెట్ వర్క్ మొబిలిటీ బిజినెస్ సీనియర్ అధికారి సుభేందు మొహంతి చెప్పారు. ప్రస్తుతం 3జి టెలిఫోనీని ప్రవేశపెడదామనుకుంటున్న ఆపరేటర్లందరూ మోటారోలా ప్రణాళిక కారణంగా తమ ప్రయత్నాలను ఆపేస్తారని, 4 జి వచ్చే వరకూ వేచి చూస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతదేశంలోని మిగతా మొబైల్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు మొహంతి సమాధానం చెబుతూ ట్రయల్ సర్వీసును మిగతా కంపెనీలతో కూడా అందించాలని అనుకుంటున్నా ముందుగా ఈ టెక్నాలజీని తమ స్వంత మొబైల్స్ నుంచి పరీక్షించి చూడాలనుకుంటున్నామని వివరించారు.
మొబైల్ లో 70 మెగాబైట్ల సమాచారాన్ని సెకనులో డౌన్ లోడ్ చేసుకునే టెక్నాలజీని మార్కెట్ చేస్తున్న మొట్టమొదటి టెలిఫోన్ కంపెనీ మోటారోలాయేనని మొహంతి చెప్పారు. ఎటిఇ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి 2.1-2.3 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ బాండ్ అవసరం ఉంటుందని, కేంద్ర టెలికాం ఈ ఫ్రీక్వెన్సీ బాండ్ ల అందుబాటును గురించి పరిశీలన చేస్తోందని చెబుతున్నారు. అయితే దేశంలో 4జి టెక్నాలజీ గురించి తెలుసుకున్నాక తమ పెట్టబడులను 3జి పై పెట్టడానికి వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. ఎలాను కేంద్ర సాధికారిక మంత్రి బృందం 3జి సర్వీసుల పై విధానాలను నిర్ణయించే పనిలో ఉన్నందున, దానిలో భాగంగానే 4జి స్పెక్ట్రం బాండ్ ను కేటాయించడానికి చెల్లించవలసిన ధరలను కూడా నిర్ణయిస్తారని భావిస్తున్నారు.
News Posted: 24 August, 2009
|